Site icon HashtagU Telugu

Harish Rao: బీజేపీ శాపం, కాంగ్రెస్ పాపం తెలంగాణకు అవసరమా: హరీశ్ రావు

Harish Rao

Harish Rao

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అందించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలతో వేలాది మంది రైతుల చావుకు కారణమైంది. మూడు గంటల కరెంటు చాలని తెలంగాణ రైతులకు శాపంగా కాంగ్రెస్ పార్టీ మారిందని ఆయా పార్టీల తీరుపై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు.

కేసీఆర్ పాలన పదేళ్లు కాదు మాకు పదేపదే కావాలి అని నినదిస్తున్నది తెలంగాణ సమాజమని, మూడు గంటల కరెంటు అన్న పార్టీని తరిమి కొట్టాలంటే ముచ్చటగా మూడో సారి కేసీఆర్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పాలిట కాంగ్రెస్ బీజేపీ లది కక్షే .. కేసీఆరే మనకు రక్ష అని అన్నారు. కిషన్ రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి సహకారం అందిస్తున్నట్టుగా, రేవంత్ కు చంద్రబాబు ఉపకారం అందిస్తున్నారని, కానీ కేసీఆర్ కు తెలంగాణ సమాజమే సహకారం అందిస్తుందని హరీశ్ అన్నారు. 2014 లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే చంద్రబాబు ప్రోద్భలం తో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కొని పసిగుడ్డు లాంటి ప్రభుత్వాన్ని చంపాలని చూశాడు. బీజేపీ వాళ్ళు కూడా ఎమ్మెల్యేలను కొనాలనుకుని అడ్డంగా దొరికిపోయారు. తెలంగాణను అస్థిరపరిచేందుకు ద్రోహులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, ప్రజలు తగిన బుద్ది చెప్పాలని అన్నారు.

ప్రతి పక్షంలో ఉన్నపుడే మూడు గంటలు కరెంటు అన్న వాడు రేపు పొరపాటున అధికారమిస్తే తన వాదనను రైతులు బలపరిచారని మూడు నిమిషాలు కూడా ఇవ్వరేమోనని హరీశ్ సెటైర్స్ వేశారు. మూడు చట్టాలు తెచ్చి ఆనాడు బీజేపీ రైతులకు శాపంలా మారితే నేడు మూడు గంటల కరెంటు అంటూ కాంగ్రెస్ పాపం చేసిందని ఆయన అన్నారు. శాపం లాంటి బీజేపీ, పాపం చేసే కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా అని హరీశ్ ప్రశ్నించారు.

Also Read: Bharat Jodo Yatra: త్వరలో భారత్ జోడో, ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ యాత్ర