HCU History: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. ఎలా ఏర్పాటైందో తెలుసా ?

జై ఆంధ్ర ఉద్యమాన్ని శాంతింపజేసే ఉద్దేశంతో ఆనాడు దేశాన్ని పాలిస్తున్న ఇందిరా గాంధీ(HCU History) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది.

Published By: HashtagU Telugu Desk
Hyderabad Central University History Hcu Hyderabad Sarojini Naidu Congress Padmaja Naidu

HCU History: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వ్యవహారం యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఎంతోమంది ప్రముఖులు స్పందించారు. అసలు విషయం ఏమిటంటే.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో హెచ్‌సీయూకు గత ప్రభుత్వాలు భారీగా భూములను కేటాయించాయి. భవిష్యత్ విద్య, పరిశోధనా అవసరాల కోసం వాటిని వినియోగించుకోవాలని నిర్దేశించాయి. అయితే ఆనాడు హెచ్‌సీయూకు కేటాయించిన ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులో మ్యుటేషన్లు (బదలాయింపులు) జరగలేదని హెచ్‌సీయూ అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల ఇప్పటికీ అవన్నీ ప్రభుత్వ భూములుగానే చలామణి అవుతున్నాయని అంటున్నారు. ఈ కారణంతోనే హెచ్‌సీయూ భూములను ట్రిపుల్ ఐటీ, గచ్చిబౌలి స్టేడియం, ఆర్టీసీ డిపో, షూటింగ్ రేంజ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, టీఐఎఫ్ఆర్, ఎన్ఐఏబీ వంటి సంస్థలకు కేటాయించారని హెచ్‌సీయూ వర్గాలు వాదిస్తున్నాయి. ఈనేపథ్యంలో మనం హెచ్‌సీయూ ఏర్పాటుకు దారితీసిన చరిత్రను తెలుసుకుందాం..

Also Read :Gold Vs Big Fall : రూ.56వేలకు బంగారం డౌన్.. ‘మార్నింగ్ స్టార్’ లెక్కలివీ

ఇందిరా గాంధీ ప్రభుత్వం చొరవతో ఆవిర్భావం

జై ఆంధ్ర ఉద్యమం 1972-73లో జరిగింది. జై ఆంధ్ర ఉద్యమాన్ని శాంతింపజేసే ఉద్దేశంతో ఆనాడు దేశాన్ని పాలిస్తున్న ఇందిరా గాంధీ(HCU History) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. 1973 సెప్టెంబర్ 21న సిక్స్ పాయింట్ ఫార్ములాను ప్రతిపాదించారు. హైదరాబాద్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ఇందులోని రెండో పాయింట్‌లో ప్రస్తావించారు.  1973 డిసెంబర్ 23న రాజ్యాంగానికి 32వ సవరణ ద్వారా ఆర్టికల్ 371(ఇ)ను చేర్చుతూ అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. 1974 సెప్టెంబర్ 3న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చట్టం తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఇందిరా గాంధీ వ్యక్తిగతంగా శ్రద్ధ, చొరవ తీసుకుని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు జరిగేలా చూశారు.

Also Read :Congress Plan : మోడీ కంచుకోటలో కాంగ్రెస్ కొత్త స్కెచ్

సరోజినీ నాయుడు నివాసంలో తరగతులు ప్రారంభం

1974 అక్టోబర్ 2న ఆబిడ్స్‌లోని గోల్డెన్ త్రెషోల్డ్ భవనంలో హ్యుమానిటీస్ సబ్జెక్టులతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ భవనం స్వాత్రంత్య సమరయోధురాలు సరోజినీ నాయుడు నివాసం.సరోజినీ నాయుడుకు గుర్తుగా ఆమె కుమార్తె పద్మజానాయుడు ఈ భవనాన్ని యూనివర్సిటీకి దానం చేశారు. సీడీవీఎల్ ఇప్పటికీ గోల్డెన్ త్రెషోల్డ్ భవనం ఆవరణలోనే కొనసాగుతోంది. 1975లో గచ్చిబౌలి ప్రాంతంలో 2,324 ఎకరాలను హెచ్‌సీయూ కోసం నాటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అక్కడ భవనాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీని గచ్చిబౌలికి తరలించారు.

  Last Updated: 11 Apr 2025, 09:08 AM IST