Hyderabad : జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇస్తాం.. డెక్కన్‌ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీకి మంత్రి కేటీఆర్‌ హామీ

జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీయిచ్చారు. ఈ అంశం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలనలో

  • Written By:
  • Publish Date - August 4, 2023 / 07:11 PM IST

జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీయిచ్చారు. ఈ అంశం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలనలో ఉందన్నారు. అసెంబ్లీలో గురువారం మంత్రి కేటీఆర్‌ను డెక్కన్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ (డీజేహెచ్‌ఎస్‌) అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, డైరెక్టర్లు దండా రామకృష్ణ, డేగ కుమార్, ప్రతాప్‌ రెడ్డి, సలహాదారు విక్రమ్‌రెడ్డి, సభ్యులు వేములపల్లి రాజు, పోలంపల్లి ఆంజనేయులు కలిశారు. ఈ సందర్భంగా వారు తమకు ఇంటి స్థలాలు కేటాయించాలని కేటీఆర్‌కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి డీజేహెచ్‌ఎస్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తొలి జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ డీజేహెచ్‌ఎస్‌ అని ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కాగా, జర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయంపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని ఆయన పేర్కొన్నారు.

చిరకాల స్వప్నాన్ని సాకారం చేయండి: డీజేహెచ్‌ఎస్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించిందని డీజేహెచ్‌ఎస్‌ ప్రతినిధులు కేటీఆర్‌తో అన్నారు. బడుగులు, బలహీన వర్గాలున్న తెలంగాణలో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రగతిపథంలో ముందుకు దూసుకెళ్తుందన్నారు. ఇందులో భాగంగా జర్నలిస్టులకూ పలు రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కోవిడ్‌ వంటి విపత్కర సమయంలోనూ జర్నలిస్టులకు అండగా నిలిచి, ఆర్ధిక సాయం అందించిన ప్రభుత్వం తెలంగాణ మినహా మరెక్కడా లేదన్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టుల చిరకాల స్వప్నం సొంతిల్లు అన్నారు. జర్నలిస్టుల సొంతింటి కల కేసీఆర్‌ ద్వారానే సాకారమవుతుందన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్‌ తదితర జిల్లాలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించడం జరిగిందన్నారు. ఇదే తరహాలో రాష్ట్ర రాజధాని కేంద్రంగా హైదరాబాద్‌ జిల్లా, రాష్ట్ర స్థాయిలో పని చేస్తున్న డీజేహెచ్‌ఎస్‌ సభ్యులకు కూడా ఇళ్ల స్థలాలను కేటాయించాలని అభ్యర్థిస్తున్నామన్నారు. జర్నలిస్టులకు ఇంటిస్థలాల కేటాయింపుపై కేటీఆర్‌ సానుకూలంగా స్పందించడం పట్ల జర్నలిస్టు వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.