Site icon HashtagU Telugu

Gaddar Cine Awards: ఉగాది నుంచి గద్దర్ అవార్డుల పంపిణీ.. డిప్యూటీ సీఎం కీల‌క నిర్ణ‌యం!

Gaddar Cine Awards

Gaddar Cine Awards

Gaddar Cine Awards: ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన గద్దర్ అవార్డుల (Gaddar Cine Awards) కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ అవార్డులు అందజేయనున్నట్టు తెలిపారు. జాతీయ సమైక్యత, ఐక్యతను పెంపొందించే సాంస్కృతిక, విద్యా, సామాజిక ఔచిత్యం కలిగిన అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆవార్డులు అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అవార్డుల కోసం లోగోతో సహా విధివిధానాలు, నియమ, నిబంధనలపై కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయస్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహించాలని డిప్యూటీ సీఎం సూచించారు. కల్చరల్ ఐకాన్ గద్దర్ ప్రతిదీ పెంచేలా అవార్డుల లోగోలు రూపొందించాలని డిప్యూటీ సీఎం తెలిపారు. సినిమా నిర్మాణంలో హైదరాబాద్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత పది సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని పరిపాలించిన వారు చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేశారు, అవార్డుల పంపిణీ జరగలేదని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

Also Read: Hyderabad Data Centers: డేటా సెంటర్ల రాజధానిగా హైదరాబాద్​.. రూ.3500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం!

రాష్ట్రంలో సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించే అవార్డులను ప్రతి ఏటా అందజేయాలని నిర్ణయించి గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులు ఈ ఉగాది నుంచి ప్రతి సంవత్సరం ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఫీచర్ ఫిల్మ్‌లు, బాలల చిత్రాలు, తెలుగు సినిమాపై పుస్తకాలు వంటి వివిధ విభాగాల కింద అవార్డులు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. అవార్డులలో నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం కూడా అందచేస్తారు. గద్దర్ అవార్డుకు సంబంధించి లోగోను కూడా రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో టీఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌రాజు, ఎండీ డాక్టర్‌ హరీశ్‌, ఈడీ కిషోర్‌బాబు, కమిటీ చైర్మన్ బీ. నర్సింగ్‌రావు, కమిటీ సభ్యులు జయసుధ, తమ్మారెడ్డి భరద్వాజ్‌, హరీశ్‌ శంకర్‌, వందేమాతరం శ్రీనివాస్‌, గుమ్మడి వెన్నెల, అల్లాణి శ్రీధర్‌, వేణు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version