Site icon HashtagU Telugu

Medical Students: ఆ మెడికల్ విద్యార్థులకు సీట్ల సర్దుబాటు బాధ్యత తెలంగాణ సర్కారుదే : ఎన్ఎంసీ

Doctors

Doctors

నిర్దేశిత ప్రమాణాల ప్రకారం తగిన వసతులు లేని తెలంగాణలోని మూడు ప్రైవేటు వైద్య కళాశాలల అనుమతులు ఇటీవల రద్దయ్యాయి. ఈనేపథ్యంలో వాటిలో చేరిన విద్యార్థుల బాధ్యతను తెలంగాణ ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పేర్కొంది.

విద్యార్థుల మెరిట్, ఇతర మెడికల్ కాలేజీల్లో ఖాళీల ఆధారంగా ఆ విద్యార్థులకు సీట్లను సర్దుబాటు చేయాలని తెలిపింది. ఒకవేళ కాలేజీల్లో సీట్లు ఖాళీగా లేకపోతే.. ఈ ఒక్కసారికి సీట్లను పెంచేందుకు సంబంధించిన అనుమతులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని వెల్లడించింది.

అయితే అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో సీట్ల సంఖ్య 250కి మించకూడదని తేల్చి చెప్పింది. పీజీ మెడికల్ సీట్లను కూడా సర్దుబాటు చేయాలని ఎన్ఎంసీ తెలిపింది. సీట్ల రద్దు సమయంలోనే.. విద్యార్థులు ఎంత ఫీజు చెల్లించాలనే వివరాలతో కూడిన మార్గదర్శకాలను రాష్ట్రానికి పంపామని పేర్కొంది. తమ అడ్మిషన్లను రద్దు చేసి సీట్ల సర్దుబాటుకు మార్గదర్శకాలను జారీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఓ ప్రైవేటు వైద్య కళాశాల కు చెందిన 48 మంది విద్యార్థులు హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ఎన్ఎంసీ తరఫున కార్యదర్శి ప్రభాత్ కుమార్ అఫిడవిట్ దాఖలు చేశారు. పైన పేర్కొన్న వివరాలన్నీ ఆ అఫిడవిట్ లో ప్రస్తావించినవే.

Pic: File photo

Exit mobile version