తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో (Telangana Politics) ప్రధాన పార్టీలైన BRS, బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress)లలో అసమ్మతి స్వరాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ పార్టీల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు అంతర్గత చర్చలకు దారి తీస్తున్నాయి. BRSలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ కార్యాచరణతో పార్టీ లోపలే కలకలం రేపుతున్నారు. ఆమె స్వతంత్రంగా జాగృతి జెండా, ఎజెండాలతో ముందుకు సాగుతూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పైనే విమర్శలు చేస్తుండటం గులాబీ పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదే కొనసాగితే కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశముందని పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది.
ఇక బీజేపీలో ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కాళేశ్వరం కేసులో హాజరై అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రధాని మోదీ అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉన్నాయని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన కౌంటర్ వ్యాఖ్యలు, ఈటల – బండి మధ్య ఉద్రిక్తతలు అధికమవుతున్నాయన్న సంకేతాలివ్వడమే కాదు, పార్టీ అంతర్గతంగా విభజన మొదలైందన్న చర్చకు దారి తీస్తున్నాయి. ఈటల తన నివాసంలో చేసిన సంచలన వ్యాఖ్యలు కూడా బీజేపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Spicejet : టేకాఫ్‌కు ముందే పెద్ద షాక్.. స్పైస్‌జెట్ ఎస్‌జీ-2138 సర్వీస్ రద్దు..!
కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గతంగా అసంతృప్తి వర్గం బలపడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన “పదేళ్లు నేనే సీఎం” అన్న వ్యాఖ్యపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీ వ్యవస్థను “సామ్రాజ్యంలా భావించకూడదు” అంటూ చేసిన వ్యాఖ్యలు, ఆయనకు మంత్రి పదవి రాకపోవడంపై ఉన్న అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించాయి. ఇది కాంగ్రెస్ పార్టీలో నిక్షిప్తమైన అసమ్మతిని బయటపెడుతుంది. ఈ వ్యాఖ్యలు రేవంత్ నాయకత్వానికి కౌంటరుగా రావడంతో, పార్టీలో లుకలుకలు ముదిరే అవకాశం కనిపిస్తోంది.
ఈ మూడు పార్టీల్లో నెలకొన్న ఈ అంతర్గత సమస్యలు త్వరగా పరిష్కారం కాకపోతే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. మిగతా పార్టీల్లో అసంతృప్తి వర్గాల చర్యలు పార్టీ పాలనపైనా, బలమైన ప్రతిపక్షంగా నిలబడాలన్న లక్ష్యంపైనా ప్రభావం చూపే అవకాశముంది. ఇప్పుడు ప్రశ్న ఇదే. ఈ అసమ్మతి నేతలు పార్టీలోనే కొనసాగుతారా? లేక కొత్త రాజకీయ సమీకరణాలకు నాంది పలుకుతారా? అనే ఆసక్తికర చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో మొదలైంది.