CM Revanth: అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు: వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్ 

  • Written By:
  • Updated On - January 29, 2024 / 08:39 PM IST

CM Revanth: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్ తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీ ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులతో చర్చించారు. ఈ నిబంధన కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని అన్నారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, ఫీజియోథెరపీ, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వరంగల్, ఎల్బీ నగర్, సనత్ నగర్, అల్వాల్ లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వైద్యుల కొరత లేకుండా మెడికల్ కాలేజీలను ఆసుపత్రులకు అనుసంధానంగా ఉండేలా చూడాలని అన్నారు. రాష్ట్రంలో మెడికల్, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీల్లో ఇంకా ప్రారంభం కాని వాటి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. కొడంగల్ లో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు పరిశీలన జరపాలని అధికారులకు సూచించారు.
బీబీనగర్ ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అన్నారు. ఎయిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. దీంతో ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై భారం తగ్గుతుందన్నారు. ఎయిమ్స్ ను సందర్శించి పూర్తిస్థాయి రిపోర్టు తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్రమంత్రిని కలిసి వివరిస్తానని సీఎం అన్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం కేవలం హైదరాబాద్ పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. ఏరియాల వారీగా ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్నారు. సంబంధిత మెడికల్ కాలేజీల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలో సమస్యలను అధికారులు సీఎంకు వివరించారు. ఉస్మానియా హెరిటేజ్ భవనానికి సంబంధించి కోర్టులో ఉన్నందున, కోర్టు సూచనల ప్రకారం ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకుందామని సీఎం అన్నారు.