KCR Comments: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టహాసంగా ప్రారంభమైంది. ముందుగా జమ్మూకశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడి మృతులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR Comments) నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కన్నతల్లి, జన్మభూమిని మించిన స్వర్గం లేదని అన్నారు. వరంగల్ మామూలు నేల కాదు.. ఎంతోమంది వీరుల్ని కన్న గడ్డ అని చెప్పారు. ఇవాళ ఈ గడ్డ మీద బీఆర్ఎస్ సభ పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజున గులాబీ జెండా ఎగిరిందని గుర్తుచేశారు.
ఆనాడు గులాబీ జెండాను ఎంతోమంది అవమానించారని చెప్పారు. కానీ ఎనాడూ నిరాశ చెందలేదని.. నిర్విరామంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించామని అన్నారు. ఉద్యమం జెండా ఎట్టి పరిస్థితుల్లో దించే ప్రసక్తే లేదని కార్యకర్తలను మాటిచ్చాను. జెండా దించితే నన్ను రాళ్లతో కొట్టాలని స్వయంగా చెప్పానని గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా జెండా దించలేదని అన్నారు. చీకట్లను పారద్రోలి తెలంగాణలో వెలుగులు తీసుకొచ్చామని తెలిపారు. వలసవాదుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక విధ్వంసమై తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించామని చెప్పారు.
Also Read: Mumbai Indians: లక్నోపై ముంబై ఘనవిజయం.. బుమ్రా సరికొత్త రికార్డు!
అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించుకున్నాం. మూడేళ్లలో కాళ్లేశ్వరం కట్టాం, పంజాబ్ను తలదన్నేలా పంటలు పండించాం, దళితబంధు, రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబీమా వంటి అనేక చారిత్రాత్మక పథకాలు తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజల రూపురేఖలు మార్చుకున్నామని అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎంతో గోసపడ్డారని తెలిపారు. ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు శత్రువు కాంగ్రెస్ పార్టీనే అన్నారు. తెలంగాణ సాధించుకొస్తామని బయల్దేరిన ఉద్యమకారుల్ని ఇందిరా గాంధీ ప్రభుత్వం పిట్టల్లా కాల్చేసిందని తెలిపారు. మళ్లీ అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో ఉంది.. ప్రజలంతా గమనించాలని సూచించారు. అంతేకాకుండా తెలంగాణకు మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీనే విలన్ అని అన్నారు.
ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీయే – కేసీఆర్ pic.twitter.com/ilkrTeO5Lx
— Telugu Scribe (@TeluguScribe) April 27, 2025