Site icon HashtagU Telugu

KCR Startegy: కేసీఆర్ వ్యూహం మారిందా? బీజేపీకి కాదని కాంగ్రెస్ ను హైలెట్ చేయడానికి కారణమేంటి?

Kcr

Kcr

రాజకీయాల్లో టైమును బట్టి, సందర్భాన్ని బట్టి వ్యూహాలను మార్చాలి. లేకపోతే ఓల్డ్ అయిపోతారు. అధికారానికి దూరమైపోతారు. అలాగే ప్రభుత్వంపై వ్యతిరేకతను చీల్చేయాలి. లేకపోతే అది పదునైన ఖడ్గంగా మారి ప్రత్యర్థులకు ఆయుధంగా మారొచ్చు. ఆ విషయం తెలంగాణ సీఎం కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే ప్రభుత్వ వ్యతిరేకతను, పార్టీపై ఉన్న వ్యతిరేకతను బాగా తగ్గించడానికి వీలుగా ఆయన చాలా వేగంగా వ్యూహాలను మార్చుతున్నారు. దానివల్లే ఇప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై ఇంత రాజకీయం నడుస్తోంది అంటున్నారు విశ్లేషకులు.

మహా అయితే రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించి వెళ్లిపోతారు. దాని వల్ల టీఆర్ఎస్ కు వచ్చే నష్టం కాని, కాంగ్రెస్ కు వచ్చే లాభం కాని పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన అమిత్ షా లా తరచుగా ఇక్కడ పర్యటనలు చేయరు. ఆ విషయం కేసీఆర్ తెలియదా అంటే బాగా తెలుసు. కానీ ఇప్పుడు దీనిపై రాజకీయం చేయడం వల్ల ఫలితం ఎలా ఉంటుందో ఆయనకు ఇంకా బాగా తెలుసని అందుకే తెలివిగా పావులు కదుపుతున్నారని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.

కేసీఆర్ చేసేవన్నీ సీజనల్ పాలిటిక్సే. ఆయన వ్యూహాల వల్ల ఒకసారి బీజేపీ హీరో అయితే.. .. మరోసారి కాంగ్రెస్ హీరో అవుతుంది. అనూహ్యంగా కేఏ పాల్ కూడా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హీరోగా మారిపోయారు. అసలు కేఏపాల్ పర్యటనను అడ్డుకుంటే వచ్చే లాభం టీఆర్ఎస్ కు ఏమాత్రం ఉండదు. ఆ సంగతి తెలిసి కూడా పార్టీ శ్రేణులు ఆయన పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నించడం, ఆయనపై పోలీసుల సమక్షంలోనే చేయి చేసుకోవడం చూస్తుంటే.. రాజకీయ వ్యూహాలు ఏ స్థాయిలో అమలు అవుతున్నాయో తెలుస్తుంది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్ల ఏ ఒక్కపార్టీ లాభపడకూడదన్నదే కేసీఆర్ అసలైన వ్యూహం. అందుకే బీజేపీ, కాంగ్రెస్ లతో పాటు చివరకు కేఏపాల్ ను కూడా ఆయన బ్యాలెన్స్ చేస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది.