తెలంగాణలో రాజకీయాలు బాగా హీటెక్కాయి. ప్రతిపక్షాలపై ఎప్పుడూ కేసీఆర్ ఎదురుదాడి చేస్తుంటారు. మంత్రి కేటీఆర్ ఎన్నికల సమయంలో మాత్రమే విరుచుకుపడతారు. మరీ గీత దాటిన దాఖలాలు కూడా లేవు. కానీ తాజాగా మాత్రం ఓ రేంజ్ లో ఫైరయ్యారు. తారకరాముడు కాస్తా.. ఉగ్రరాముడయ్యాడు. అసలిప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు. ఒకవేళ ముందస్తు అనుకున్నా వాటికి ఇంకా కనీసం ఏడాది సమయం అయినా ఉంటుంది. మరి ఇప్పుడెందుకు ఫైర్ అయ్యారు?
కేటీఆర్ కూల్ గా కనిపించే వ్యక్తి. కానీ ఎన్నికలు వచ్చినా.. ప్రతిపక్షాలు జోరు పెంచినా .. వెంటనే మాటల తూటాలు వదులుతారు. ఇప్పుడు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన రాష్ట్రంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్, కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిలపై విరుచుకుపడ్డారు. దీంతో అదే స్థాయిలో వాళ్లు కూడా ప్రతిస్పందించారు. నిజానికి కేటీఆర్ కు కావలసింది కూడా అదే. అలా మాట్లాడి వారు తన ట్రాప్ లో పడేలా చేశారంటున్నారు విశ్లేషకులు.
కేంద్రానికి రూ.3,65,797 కోట్లు ఇచ్చామని, తెలంగాణకు కేంద్రం రూ.1.65 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని.. ఈ లెక్కలు తప్పని రుజువు చేస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని సవాల్ చేశారు. ఇక్కడే అసలు లెక్క ఉంది. కేటీఆర్ ఊహించినట్లుగానే.. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు రియాక్ట్ అయ్యారు. దీంతో ఎన్నికల హీట్ పెరిగినట్లయిందని.. దీంతోపాటు తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్న వాదన తెరపైకి వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.
ఇప్పటికే ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీని దోషిగా నిలబెట్టామని టీఆర్ఎస్ సంతోషంగా ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ వేగంగా పుంజుకుంటుండడంతో దానిని కూడా దోషిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తోంది టీఆర్ఎస్. అందుకే కేంద్రంలో పట్టు కోసం కేసీఆర్ ప్రయత్నిస్తుంటే.. రాష్ట్రంలో పట్టు కోసం కేటీఆర్ ఇలా ఉగ్రరూపం ఎత్తారని అంటున్నారు విశ్లేషకులు. కానీ ఇది అంతిమంగా ఎవరికి లాభిస్తుందో వచ్చే ఎన్నికల్లో తేలిపోతుంది.