KTR Politics: ఏపీ మంత్రులు.. తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యూహంలో చిక్కుకున్నారా?

తెలంగాణ మంత్రి కేటీఆర్ కొద్ది రోజుల కిందట పక్కరాష్ట్రంపై విమర్శలు చేశారు. ఆ పక్క రాష్ట్రం ఏదో చెప్పకపోయినా.. అది ఆంధ్రప్రదేశ్ అని అందరికీ అర్థమైంది.

  • Written By:
  • Publish Date - May 1, 2022 / 07:01 PM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్ కొద్ది రోజుల కిందట పక్కరాష్ట్రంపై విమర్శలు చేశారు. ఆ పక్క రాష్ట్రం ఏదో చెప్పకపోయినా.. అది ఆంధ్రప్రదేశ్ అని అందరికీ అర్థమైంది. కరెంటు ఉండదని, రోడ్లు బాగోవని.. ఇలా కామెంట్స్ చేశారు. ఆయన అలా మాట్లాడారో లేదో ఇలా ఆంధ్రప్రదేశ్ మంత్రులు వరుసగా రంగంలోకి దిగేశారు. మంత్రి బొత్స అయితే.. తెలంగాణలోనే కరెంట్ ఉండదని.. హైదరాబాద్ కు తాను వెళ్లినప్పుడు అక్కడ తన ఇంట్లో కరెంటే లేదని చెప్పుకొచ్చారు. మంత్రి రోజా అయితే కేటీఆర్ కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని.. ఆయన టైమ్ ఇస్తే.. రాష్ట్రమంతా తిప్పి చూపిస్తానని.. ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. ఎల్లో మీడియాలో కథనాలు చూసి అవే వాస్తవాలు అనుకోవద్దని ఏపీ మంత్రులు అన్నారు.

కేటీఆర్ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఇవేవో ఉద్దేశపూర్వకంగా చేసినవి మాత్రం కాదని అర్థమవుతోంది. ఎందుకంటే ఏపీ పైన కాని, వైపీసీ పైన కాని ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల కేటీఆర్ కు వచ్చిన రాజకీయ లబ్ది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడేమీ ఎన్నికలు కూడా లేవు. ఏపీ మంత్రుల విమర్శల పర్వం కొనసాగుతుండడంతో తరువాత కేటీఆర్ ఇచ్చిన వివరణను పరిశీలించినా ఈ విషయం అర్థమవుతుంది. కానీ ఇక్కడే
ఉంది అసలు లాజిక్కు.

నిజానికి వైసీపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ బంధం ఈనాటిది కాదు. తెలంగాణ వచ్చిన తరువాత వైసీపీ.. తెలంగాణకు దూరమైంది. అక్కడి రాజకీయాల నుంచి నిష్క్రమించింది. ఆ తరువాత ఏపీలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏపీలో అభివృద్ధి జరగడం లేదని.. తెలంగాణ అభివృద్ధి చెందుతోందని జగన్ ఆరోపించేవారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ, టీఆర్ఎస్ కు బాగా దగ్గరైంది.
కేసీఆర్, కేటీఆర్, వైఎస్ జగన్ బెస్ట్ ఫ్రెండ్స్ లా వ్యవహరిస్తున్నారు. మరి ఇంతటి సాన్నిహిత్యం, స్నేహం ఉన్నప్పుడు కేటీఆర్ ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేసినట్లు అని చాలామందికి అనుమానం వస్తుంది.

కేటీఆర్ గతంలో కర్ణాటకలో పరిస్థితులపైనా మాట్లాడారు. అక్కడి కంపెనీలను ఆహ్వానించారు. ఇందులో రాజకీయ కోణం కూడా ఉంది. ఎందుకంటే కన్నడ గడ్డను పాలిస్తోంది బీజేపీ ప్రభుత్వం. అందుకే కేటీఆర్ ఆ యాంగిల్ లో కామెంట్స్ చేశారు. తరువాత కొద్ది రోజుల కిందట బండి సంజయ్.. కర్ణాటకలో పాలన, వసతులు భేష్ అవసరమైతే వెళ్లి చూడండి.. కావాలంటే వాహనాలు కూడా సమకూరుస్తాం అని చెప్పారు. దీంతో కేటీఆర్ పక్క రాష్ట్రాలతో పోలుస్తూ.. అభివృద్ధిలో తెలంగాణను మించింది లేదని చెప్పుకొచ్చారు. కానీ ఇది ఏపీ వరకు వచ్చేసరికీ.. వైసీపీకి తలనొప్పిగా మారింది. ఎందుకంటే అక్కడ టీడీపీకి ఇది ఆయుధంగా మారింది. వైసీపీ పాలన అధ్వాన్నంగా ఉందని.. మౌలిక వసతులు కూడా లేవంటూ కేటీఆర్ కామెంట్స్ ను ఉదహరిస్తోంది. ఇది జగన్ ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందిని కలిగిస్తోంది.

కేటీఆర్ వ్యూహం ఏమిటంటే.. తెలంగాణ అభివృద్ధి చెందుతోందని చెప్పాలంటే.. దానికన్నా ప్రగతి తక్కువున్న రాష్ట్రాలతో పోల్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ఏపీని టార్గెట్ గా చేసుకున్నారంటున్నారు విశ్లేషకులు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ రగిలించేలా ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అలా కేటీఆర్ వ్యూహంలో ఏపీ మంత్రులు చిక్కుకున్నారంటున్నారు.