Dharmapuri Aravind : పొలిటిక‌ల్ ‘ప్రివిలేజ్’ యుద్ధం!

బీజేపీ, టీఆర్ఎస్ ప‌ర‌స్ప‌ర రాజ‌కీయ దాడుల‌కు కేంద్రంగా తెలంగాణ మారుతోంది.

  • Written By:
  • Updated On - January 28, 2022 / 02:13 PM IST

బీజేపీ, టీఆర్ఎస్ ప‌ర‌స్ప‌ర రాజ‌కీయ దాడుల‌కు కేంద్రంగా తెలంగాణ మారుతోంది. రాష్ట్రంలో జ‌రుగుతోన్న పొలిటిక‌ల్ యుద్ధం లోక్ స‌భ ప్రివిలేజ్ క‌మిటీని ఆలోచింప చేస్తోంది. ఎంపీల‌పై తెలంగాణ పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరును ప్రివిలేజ్ క‌మిటీ అధ్య‌య‌నం చేస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ అరెస్ట్ విష‌యంలో పోలీసుల అత్యుత్సాహం క‌మిటీ ఎదుట ఉంది. పోలీసులకు నోటీసులు ఇచ్చే వ‌ర‌కు ఆ అరెస్ట్ వెళ్లిడం గ‌మ‌నార్హం.తాజాగా నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ మీద టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు దాడికి పూనుకున్నారు. సుమారు 20 ట్రాక్ట‌ర్ల‌లో వంద‌లాది మంది గులాబీ క్యాడ‌ర్ హ‌త్య‌కు కుట్ర‌ప‌న్నింద‌ని అర‌వింద్ ఆరోపిస్తున్నాడు. ఆ సంద‌ర్భంగా తెలంగాణ పోలీసులు వ్య‌వ‌హరించిన తీరుపై మండిప‌డుతున్నాడు. ప్రివిలేజ్ క‌మిటీకి ఫిర్యాదు చేయ‌డానికి సిద్ధం అవుతున్నాడు. ఆ రోజున జ‌రిగిన దాడితో పాటు హ‌త్య‌కు ఏ విధంగా కుట్ర ప‌న్నారో..తెలియ‌చేస్తూ ఫిర్యాదు చేస్తాన‌ని పోలీసుల్ని హెచ్చ‌రించాడు.

ఇటీవ‌ల ధ‌ర్మ‌పురి అర‌వింద్ తెలంగాణ ప్ర‌భుత్వంపై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నాడు. కొన్ని సంద‌ర్భాల్లో రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేశాడు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌లేద‌ని కేసీఆర్ స‌ర్కార్ పై నిత్యం మీడియా వేదిక‌గా దుమ్మెత్తిపోస్తున్నాడు. వాటిని గ‌మ‌నించిన గులాబీ శ్రేణులు అర‌వింద్ ను టార్గెట్ చేశారు. లోక్ స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అర‌వింద్ ఇచ్చిన ప‌సుపు బోర్డ్ హామీని తెర‌మీద‌కు తీసుకొచ్చారు. ఆ హామీని ఎందుకు నెర‌వేర్చ‌లేద‌ని నిల‌దీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీంతో ఎక్క‌డిక‌క్క‌డే ఉద్రిక్త‌త చోటుచేసుకుంది.ప‌సుపు బోర్డ్ వ్య‌వ‌హారం కొన్ని ద‌శాబ్దాలుగా న‌డుస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌తి పార్టీ హామీ ఇస్తోంది. ఆ విధంగా 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి గెలిచిన ధ‌ర్మ‌పురి అర‌వింద్ కూడా హామీని కొత్త పంథాలో ఇచ్చాడు.ఆ ఎన్నిక‌ల్లో సుమారు 185 మంది ప‌సుపు రైతులు నామినేష‌న్ వేసిన విష‌యం విదిత‌మే. దీంతో ప‌సుపు బోర్డు వ్య‌వ‌హారం దేశ‌రాజ‌కీయ‌ల్లో చ‌ర్చ‌కు దారితీసింది. అంతేకాదు, టీఆర్ఎస్ సానుభూతిప‌రులుగా ఉన్న 20 మంది ప‌సుపు రైతులు వార‌ణాసిలో మోడీ పై పోటీకి దిగారు. దీంతో ప‌సుపు బోర్డ్ హామీ జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు దారితీసిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్థితిని అనుకూలంగా మ‌లుచుకోవ‌డానికి అరవింద్ ఆనాడు మాస్ట‌ర్ స్కెచ్ వేశాడు. బోర్డు ఏర్పాటుపై ఓట‌ర్ల‌కు బాండ్ పేప‌ర్ రాసిచ్చాడు.

నిజామాబాద్ ఎంపీగా గెలిపిస్తే ప‌సుపు బోర్డు తీసుకు వ‌స్తాన‌ని.. లేదంటే ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి పోరాటం చేస్తాన‌ని బాండ్ పేప‌ర్ పై రైతుల‌కు రాసిచ్చాడు. జాతీయ‌గా పార్టీ ఉన్న బీజేపీ పసుపు బోర్డును ఇస్తుంద‌ని భావించి ధర్మపురి అర్విందను ఎంపీగా గెలిపించారు. కేసీఆర్ కుమార్తె, సిట్టింగ్​ ఎంపీ క‌విత‌పై అర్వింద్​ ఘ‌న‌విజ‌యం సాధించాడు. రెండున్న‌ర యేళ్లు అవుతున్నా ప‌సుపు బోర్డు రాలేదు. రాత‌పూర్వ‌కంగా త‌ప్పుడు హామీ ఇచ్చాడ‌ని రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు ఎక్క‌డిక‌క్క‌డ అరంవింద్ ను నిల‌దీస్తున్నారు. ఆక్ర‌మంలోనే ఆర్మూర్ మండ‌లం ఆలూరు వ‌ద్ద 20 ట్రాక్ట‌ర్ల‌తో వ‌చ్చిన రైతులు అరవింద్ ను అడ్డుకున్నారు. రాజీనామా చేయాల‌ని నిల‌దీస్తూ అడ్డుగా ట్రాక్ట‌ర్ల‌ను ఉంచారు. దీంతో ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఈ సంఘ‌ట‌న వెనుక టీఆర్ఎస్ కుట్ర ఉంద‌ని అర‌వింద్ భావిస్తున్నాడు. అంతేకాదు, హ‌త్య చేసేందుకు టీఆర్ఎస్ గుండాలు కుట్ర ప‌న్నార‌ని ఫిర్యాదు చేయ‌డానికి సిద్ధం అయ్యాడు. రైతులు చుట్టుముట్టిన స‌మ‌యంలో పోలీసులు స‌కాలంలో అడ్డుకోలేద‌ని ఎంపీ ఆరోప‌ణ‌. పైగా వాళ్ల‌కు స‌హ‌కారం అందించార‌ని ఆనుమానిస్తున్నాడు. హ‌త్య కుట్ర‌కు ప‌రోక్ష స‌హ‌కారం తెలంగాణ పోలీసులు ఇస్తున్నార‌ని ప్రివిలేజ్ క‌మిటీకి అరవింద్ ఫిర్యాదు చేయ‌డానికి రంగం సిద్ధం చేశాడు. సో…మ‌రోసారి తెలంగాణ బీజేపీ, టీఆర్ఎస్ రాజ‌కీయ‌దాడి ఢిల్లీకి చేర‌నుంద‌న్న‌మాట‌.