హైదరాబాద్, తెలంగాణ: Telangana DGP – తెలంగాణ డీజీపీ జితేందర్ సోషల్ మీడియాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్లకు ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ, ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై రౌడీ షీట్లు, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తెరవాలని ఆదేశించారు.
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్‌లు, తప్పుడు ప్రచారాలు, బెదిరింపులు వంటి సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అటువంటి కాంటెంట్ వల్ల అమాయకులు మానసికంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు – ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, సైబర్ నేరానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ఈ విధంగా ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా సైబర్ నేరాలకు అడ్డుకట్టు వేయొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ప్రజలు సామాజిక మాధ్యమాలను బాధ్యతగా వినియోగించాలని, అభ్యంతరకరమైన, బాధ్యతలేని పోస్టులు పెట్టొద్దని డీజీపీ సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.