Site icon HashtagU Telugu

Kulagana Survey : కులగణన సర్వే వివరాలు

Caste Survey

Caste Survey

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కులగణన నివేదిక(Kulagana Survey)ను రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ద్వారా తయారు చేసి, క్యాబినెట్ సబ్ కమిటీకి సమర్పించింది. రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా మరియు బృందం, ఈ నివేదికను కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar) కి అందజేసారు. ఈ నివేదికపై సోమవారం జరిగిన సమావేశంలో చర్చలు జరిపిన తరువాత తుది ఆమోదానికి సిద్ధంగా ఉంది. ఈ సర్వే రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు నిర్వహించబడింది, ఇందులో సుమారు 3.54 కోట్ల మంది డేటాను నమోదు చేశారు. సర్వేలో మొత్తం కుటుంబాల 96.9 శాతం పాల్గొనడంతో, రాష్ట్ర జనాభా యొక్క విశాల డేటా సేకరణ సాధ్యమైంది. 76 ప్రశ్నలతో కూడిన ఈ సర్వే ద్వారా ప్రజల ఆర్థిక స్థితిగతులు, కుటుంబ నిర్మాణం, సామాజిక వివరాలు మొదలైన వాటిని సమగ్రంగా సేకరించారు.

Bhatti : ప్రమాదంలో మృతి చెందిన వ్యవసాయ కూలీ కుటుంబాన్ని పరామర్శించిన భట్టి

సర్వేలో ఎస్సీల జనాభా 17.43 శాతం, ఎస్టీల జనాభా 10.45 శాతం అని నమోదు చేయబడ్డాయి. అలాగే, బీసీల జనాభా 46.25 శాతం కాగా, ముస్లిం మైనారిటీ బీసీలు 10.08 శాతం వాటా కలిగి ఉన్నట్లు గణాంకాలు వెల్లడయ్యాయి. ముస్లింల మైనారిటీ బీసీలతో కలిపి మొత్తం బీసీల రేటు 56.33 శాతం అని సర్వేలో తేలింది. ప్రధానంగా ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2.48 శాతం, మొత్తం ముస్లిం మైనారిటీలు 12.56 శాతం, మరియు ఓసీల జనాభా 15.79 శాతం గా నమోదు చేయబడ్డాయి. 3.1 శాతం జనాభా సర్వేలో పాల్గొనలేదని తేలింది. ఈ నివేదికపై సోమవారం క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చలు జరిపిన తరువాత, తుది ఆమోదం పొందిన వెంటనే, ఈ నెల 5న ఉదయం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో నివేదిక ప్రవేశ పెట్టడం జరగనుంది.