Site icon HashtagU Telugu

Secunderabad Fire: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం.. ప్లాన్ ప్రకారమే జరిగిందా?

Secundrabad

Secundrabad

అగ్నిపథ్ పై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళ ఓ పథకం ప్రకారమే జరిగిందా? ఎందుకంటే సంఘటనకు ముందు వాట్సప్ గ్రూప్ ల ద్వారా ఈ సమాచారాన్ని కావలసినవారికి చేరవేసినట్లుగా తెలుస్తోంది. అంటే ప్లాన్ ప్రకారమే.. ఆందోళనకారులు ముందుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు.

ఆర్మీ ఉద్యోగాలను ఆశిస్తున్న వారంతా ఇలా వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారని సమాచారం. అగ్నిపథ్ గురించి కేంద్రం చెప్పినప్పటి నుంచి ఆర్మీ ఉద్యోగుల ఆశావహుల్లో నిరాశ అలుముకుంది. అందుకే వాళ్లే ఈ పథకానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. సికింద్రాబాద్ స్టేషన్ లో నిరసన తెలుపడానికి వీలుగా తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఆర్మీ ఉద్యోగాలను ఆశించినవారంతా హైదరాబాద్ కు చేరుకున్నారు.

ఈ నిరసనకారులంతా తమ మధ్య సమన్వయం కోసం జిల్లాల వారీగా వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ఒకరి నుంచి మరొకరు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారు. శుక్రవారం ఉదయమే ఆందోళనకారులు స్టేషన్ బయట నిరసన తెలిపారు. అప్పుడే ఓ బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఆ తరువాత ఉదయం 9 గంటలప్పుడు ఆందోళన కారులంతా ఒక్కసారిగా స్టేషన్ లోపలికి దూసుకొచ్చారు. నేరుగా పట్టాలపైకి వెళ్లారు. తరువాత స్టేషన్ లో స్టాళ్లను టార్గెట్ గా చేసుకుని వాటిని ద్వంసం చేశారు. ఆపై స్టేషన్ లో నిలిపి ఉంచిన రైళ్ల కిటికీలు పగలగొట్టారు. రైల్వే పార్సిల్ సెక్షన్ కు వెళ్లి వాటన్నింటినీ తీసుకొచ్చి పట్టాలపై వేసి మంటపెట్టారు.

ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టడంతో పరిస్థితి చేయిదాటుతోందని పోలీసులకు అర్థమైంది. ప్రయాణికులు, స్టేషన్ లో ఉన్నవారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీంతో ఉద్రిక్తతలను అదుపు చేయడానికి స్టేషన్ కు అదనపు బలగాలు చేరుకున్నాయి. కానీ వారిపై నిరసనకారులు రాళ్ల వర్షం కురిపించారు. లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగంతో ఫలితం లేకపోవడంతో.. రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా ఆందోళనకారులు మాత్రం వెనక్కు తగ్గలేదు.

Exit mobile version