రెక్కాడితేకానీ డొక్కాడని బతుకులు అవి. బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకుని భాగ్యనగరానికి వలస వచ్చిన ఈ కూలీల బతుకులు బుగ్గిపాలయ్యాయి. రాత్రింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని…పొట్టనింపుకునే శ్రమజీవులను అగ్నిప్రమాదంలో మృత్యువు వెంటబడింది. అంతా పాతికేళ్ల వయస్సున్న యువకులే. బతుకు మీద ఎన్నో ఆశలు. వాళ్ల మీద ఆధారపడిన ఎన్నో బతుకులు. ఊరి కానీ ఊరు…కన్నవాళ్లకు, అయినవాళ్లకు దూరంగా ఉంటూ బతుకున్నవారిని పాపిష్టి అగ్నిప్రమాదం కాల్చి బూడిద చేసింది. కోవిడ్ లాక్ డౌన్ కారణంగా దాదాపు ఏడాది పాటు జీవనోపాధి లేకపోవడంతో బీహార్ లోని సరన్ జిల్లా నుంచి 15 మంది కార్మికులు గతేడాది సికింద్రాబాద్ కు వలస వచ్చారు. స్క్రాప్ గోడౌన్ లో పని కుదుర్చుకున్నారు.
ఈ 15 మంది కూలీలు పేద కుటుంబాలకు చెందినవారు. తమ బంధువులు, స్నేహితుల ద్వారా హైదరాబాద్ కు వలస వచ్చారు. బోయిగూడ ప్రాంతంలోని గోడౌన్ లో మొదటి అంతస్తుల్లో రెండు గదుల్లో ఉంటున్నారు. చాలీచాలని జీతాలు కావడంతో డబ్బు ఆదా చేసుకునేందుకు రెండు గదుల్లో మొత్తం 12మంది కాలం వెళ్లదీస్తున్నారు. తెల్లవారు జామున 3 గంటల సమయంలో బోయిగూడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పెద్దెత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఎనిమిది ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్య్కూట్ జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తుక్కుగోదాంలో మంటలు చెలరేగి…పైనున్న టింబర్ డీపోకు వ్యాపించాయి. డిపో నిండా కట్టెలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 11మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎంత శ్రమించినా ఫలితం లేకుండా పోయింది.
అయితే ఈ ప్రమాదం నుంచి 23 ఏళ్ల ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రత్యక్ష సాక్షి అయిన ప్రేమ్ కుమార్ బీహార్ కు చెందినవాడు. ప్రేమ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…స్క్రాప్ గోడౌన్ యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నాడు. రెండు సంవత్సరాల నుంచి స్క్రాప్ గోడౌన్ లో పనిచేస్తున్నట్లు ప్రేమ్ కుమార్ తెలిపాడు. నిన్న రాత్రి తనతో పాటుగా మరో 11మంది రెండు వేర్వేరు గదుల్లో నిద్రపోతున్నామని తెలిపాడు. ఓ చిన్న రూమ్ లో తనతో పాటు బిట్టు , సంపత్ ఉన్నారని…మరో తొమ్మిది మంది వేరే గదిలో నిద్రపోతున్నారని తెలిపాడు. రాత్రి 8 గంటలకు భోజనం చేసి…గ్రౌండ్ ఫ్లోర్ లోని షట్టర్ ను దించారు. గోదాంలో నుంచి బయటకు వెళ్లేందుకు ఇది ఒకటే మార్గమని ప్రేమ్ కుమార్ తెలిపాడు. తాను కష్టపడి కిటికీలో నుంచి బయటకు వచ్చినట్లు తెలిపాడు.
మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృతులు బంధువుల రోదనలు వర్ణాతీతం. ప్రాణాలు కోల్పోయిన వారంతా కూడా బీహార్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన వలస కూలీలే. మృతులంతా కూడా బీహార్ రాష్ట్రంలోని చప్రా జిల్లాకు చెందినవారు. ఈ ఘటనలో 11మంది కూలీల మృతదేహాలు గుర్తుపట్టులేనంతగా కాలిపోయి మాంసం ముద్దలుగా మారాయి. రోజంతా కష్టపడి…రేపటి మీద ఆశలో అలసిపోయి…రాత్రి నిద్రించిన వాళ్లు మంగళవారం రాత్రే వారికి ఆఖరి రాత్రి అయ్యింది. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని ఎండనక, వాననక కష్టపడి జీవిస్తున్న కార్మికులు…వారి పిల్లలు అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతులను బిట్టుకుమార్ రామ్ (20) సికిందర్ (40) సత్యేందర్ కుమార్ (30) చెట్టిలాల్ రామ్ (28) దామోదర్ (27) శింటు కుమార్ (27) దుర్గారామ్ (35) రాకేష్ (25) దీపక్ కుమార్ (26) పంకజ్ (26), దరోగా (35) గా గుర్తించారు ప్రాణాలతో బయటపడిన ప్రేమ్ కుమార్ వయస్సు 25 సంవత్సరాలు.
26 ఏళ్ల పంకజ్ కుమార్…సోనూకుమార్ కు మేనల్లుడు. పంకజ్ కుమార్ అగ్నిప్రమాదంలో మరణించడాన్న వార్త తెలియగానే..గుండెలవిసేలా రోదించాడు. సరన్ లోని పురుషోత్తంపూర్ లో నివసిస్తున్న తన కుటుంబం పంకజ్ సంపాదన మీదే ఆధారపడిందని చెప్పాడు. ఐదు నెలల క్రితమే పంకజ్ హైదరాబాద్ కు వచ్చాడని తెలిపాడు. కోవిడ్ సమయంలో ఎన్నోమరణాలు చూశాం…ఎన్నో బాధలను తట్టుకుని నిలబడ్డాం కానీ ఇప్పుడు అగ్నిప్రమాదంలో తన మేనల్లుడు మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని వాపోయాడు.
రెస్టారెంట్ లో వర్క్ చేస్తున్న రంగాలాల్ రామ్..తన బావమరిది దీపక్ రామ్, 21ఏళ్ల మేనల్లుడు బిట్టుకుమార్ ను కోల్పోయాడు. దీపక్..సరన్ లోని సోనేపూర్ నివాసి. గత 12 సంవత్సరాలుగా హైదరాబాద్ లోనే నివసిస్తున్నాడు. దీపక్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంతో మంది యువకులకు హైదరాబాద్ లో ఉద్యోగాల్లో చేర్పించాడు. ఎంతో మంది యువకులకు ప్రేరణగా నిలిచాడు. తమ గురించి ఎప్పటికప్పుడు యోగక్షేమాలు తెలుసుకుంటూ తరచుగా మాట్లాడేవాడని…ఇలా అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తట్టుకోలేకపోతున్నామని రంగాలాల్ రామ్ భోరుమన్నాడు.