Telugu Students: క్షణం క్షణం.. భ‌యం భ‌యం!

యుద్ధం అంటే సినిమాల్లో చూడ‌డ‌మే త‌ప్ప‌, నిజ‌జీవితంలో ఎవ‌రూ చూసి ఎరుగ‌రు. ఇండియ‌న్స్ విష‌యానికి వ‌స్తే ఎక్కడో క‌శ్మీర్‌లో ఉండేవారికి త‌ప్ప తుపాకీ పేలుళ్లను చూసే, వినే అనుభ‌వ‌మే ఉండ‌దు.

  • Written By:
  • Updated On - February 28, 2022 / 12:13 PM IST

యుద్ధం అంటే సినిమాల్లో చూడ‌డ‌మే త‌ప్ప‌, నిజ‌జీవితంలో ఎవ‌రూ చూసి ఎరుగ‌రు. ఇండియ‌న్స్ విష‌యానికి వ‌స్తే ఎక్కడో క‌శ్మీర్‌లో ఉండేవారికి త‌ప్ప తుపాకీ పేలుళ్లను చూసే, వినే అనుభ‌వ‌మే ఉండ‌దు. అలాంటిది ఇప్పుడిప్పుడే లైఫ్‌లోకి అడుగుపెడుతున్న ఇండియ‌న్ యూత్.. యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. దాని ఎఫెక్ట్స్‌ను అనుభ‌విస్తున్నారు. భీక‌ర వార్ జ‌రుగుతున్న ఉక్రెయిన్‌లో భార‌తీయ వైద్య విద్యార్థులు బిక్కుబిక్కుమ‌ని కాలం గ‌డుపుతున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారిలో తెలుగు మెడికోల సంఖ్య అధికంగా ఉండ‌డంతో ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఆ దేశ రాజ‌ధాని కీవ్‌లో ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడే యుద్ధం భీకరంగా జ‌రుగుతోంది. మెడికోలంద‌రూ ఇళ్లల్లో గబగబా వండుకోవడం.. రోజంతా అండ‌ర్ గ్రౌండ్ బంక‌ర్లలోకి వెళ్లి త‌ల‌దాచుకోవడం.. ఇదే పరిస్థితి. ముందుగా కొన్ని వంట స‌ర‌కులను కొనుగోలు చేసినా, అవి చాలా మంది వ‌ద్ద అయిపోయాయి.

యుద్ధం ఎన్నాళ్లు ఉంటుందో తెలియకపోవడంతో.. కేవలం ఐదు రోజులకు సరిపడా సరుకులు మాత్రమే కొన్నారు. ఇక‌పై ఫుడ్‌ ఎలా అన్న ఆందోళ‌న నెల‌కొంది. చాలా చోట్ల డ్రింకింగ్ వాట‌ర్‌కు కూడా ఇబ్బందిక‌రంగా ఉంది. సివియ‌ర్ వార్ కార‌ణంగా స‌హ‌జంగానే ప్రభుత్వం మార్షల్ లా, క‌ర్ప్యూ విధించింది. దాంతో షాపుల‌న్నీ బంద‌య్యాయి. ఎవ‌రూ బంక‌ర్లను దాటి బ‌య‌ట‌కు వెళ్లడానికి అవ‌కాశం లేదు.

క‌రెంటు లేక‌పోవ‌డంతో మంచి నీరు కూడా స‌ర‌ఫ‌రా కావ‌డం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నదాంతోనే కాలం గడపుదామన్నా ఆ అవకాశం లేదు. దీంతో మంచినీరు, ఆహారం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. పైగా వారికి స‌మీపంలోనే బాంబులు ప‌డుతుండ‌డంతో పరిస్థితి బీభత్సంగా మారిపోయింది. అర్థరాత్రి వేళ తమ ఇంటికి దగ్గరలోనే బాంబు ప‌డింద‌ని, ఆయిల్ ఫ్యాక్టరీపై బాంబు ప‌డి మంట‌లు వ్యాపించ‌డాన్ని చూశామ‌ని వ‌రంగ‌ల్‌కు చెందిన విద్యార్థి చెప్పాడు. హాస్టళ్లలో ఉండే విద్యార్థుల ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. ఎవ‌రు సాయం చేస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

Cover Photo Courtesy- Twitter