Site icon HashtagU Telugu

Srinivas Reddy : సొసైటీలలో లేకున్నా ఇళ్ల స్థలాలు.. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

Deserving journalists must be given justice..Media Academy Chairman Srinivas Reddy

Deserving journalists must be given justice..Media Academy Chairman Srinivas Reddy

Media Academy Chairman Srinivas Reddy : ప్రభుత్వ నిబంధన మేరకు సొసైటీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్లస్థలం అందుతుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. (TUWJ) టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శిగా నియామకమైన కలుకూరి రాములు పదవి బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమాన్ని బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాములును అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్ల గోస ముఖ్యమంత్రి చేతుల మీదుగా జవహార్ లాల్ నెహ్రూ సొసైటీకి స్థలం అప్పగింత పత్రాలతో తీరిందన్నారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో యూనియన్ కీలక పాత్ర..

ఇతర జర్నలిస్టులు ఎలాంటి అనుమానాలు అపోహలకు గురికావద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. కొందరు జర్నలిస్టులు తాము ఎలాంటి హౌసింగ్ సొసైటీలలో సభ్యులుగా లేమని తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. నిబంధనల మేరకు వర్కింగ్ జర్నలిస్టుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అక్రిడికేషన్ లతో సంబంధం లేకుండా, సొసైటీలతో సంబంధం లేకుండా దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరిస్తుందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో యూనియన్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. గతంలో జర్నలిస్టులకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గోపనపల్లిలలో ఇళ్ల స్థలాలు వచ్చాయన్న, అక్రిడేషన్ల సౌకర్యం వచ్చిందంటే అది కేవలం యూనియన్ చేసిన పోరాటాలె అని, ఇందుకు దేశోద్ధారక భవన్ వేదిక అని గతంలో చేసిన పోరాటాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రతి జర్నలిస్టు వృత్తి ధర్మాన్ని పెంపొందించుకుంటూ సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిష్పక్షపాతంగా పోరాటాలు..

ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ మాట్లాడుతూ.. సంఘాన్ని మరింత పటిష్టం చేయాలన్న దృక్పథంతోనే ఎలక్ట్రానిక్ మీడియా విభాగానికి చెందిన రాములును ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను ఏకం చేసి త్వరలోనే ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా సదస్సును నిర్వహిస్తామని తెలిపారు. సంఘంలో మహిళా జర్నలిస్టుల ప్రాధాన్యతను పెంపొందించేందుకు మహిళా విభాగాన్ని పటిష్టం చేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిష్పక్షపాతంగా పోరాటాలు చేసేది తమ యూనియన్ నేనని ఆయన అన్నారు.

హెచ్ యు జె అధ్యక్షులు శిగా శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, స్టీరింగ్ కమిటీ సభ్యులు మాజిద్, రాష్ట్ర కోశాధికారి మోతే వెంకట్ రెడ్డి, కార్యదర్శి యాదగిరి, జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కిరణ్ కుమార్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రవి కాంత్ రెడ్డి, హెచ్ యుజె ప్రధాన కార్యదర్శి షౌకత్, యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, తెలంగాణ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.ఎన్. హరి, వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు నాగరాజు గౌడ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: Pawan Kalyan : వరద ప్రాంతాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన