తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీసీల (BC) ప్రాధాన్యం పెరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో చేపట్టనున్న క్యాబినెట్ విస్తరణలో బీసీలకు పెద్దపీట వేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇద్దరు బీసీ నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ, వారిలో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని యోచిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
RGV : రేపు పోలీసుల విచారణకు హాజరుకానున్న వర్మ..!
ప్రస్తుతం తెలంగాణలో వివిధ సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నట్లు వినికిడి. ఎస్టీ, మైనార్టీ, రెడ్డి, వెలమ సామాజిక వర్గాలకు ఒక్కొక్క మంత్రిపదవి ఇవ్వాలని సీఎం రేవంత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, బీసీలకు మరింత ప్రాముఖ్యత ఇస్తూ, వారిలో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఈ నిర్ణయం వెనుక కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఎన్నికల్లో బీసీల మద్దతు కీలకంగా మారిన నేపథ్యంలో వారికి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ ఈ దిశగా అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో బీసీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది.
అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన రాకపోయినా, హైకమాండ్ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు బీసీ నేతలు మంత్రిపదవుల కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పదవి ఎవరికి దక్కుతుందనే అంశం త్వరలోనే తేలనుంది.