Deputy CM Bhatti Vikramark : రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి..మధిర ప్రజలకు పెద్దకొడుకు: భట్టి విక్రమార్క

ఇందిరమ్మ రాజ్యం.. ప్రజా ప్రభుత్వంలో మీ సమస్యలు తీరిపోతాయి.. ఇండ్లు, రేషన్ కార్డులు వస్తాయి అని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.

Published By: HashtagU Telugu Desk
Deputy CM Bhatti Vikramarka meet the villagers of Vallapuram

Deputy CM Bhatti Vikramarka meet the villagers of Vallapuram

Deputy CM Bhatti Vikramark : మధిర నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ వేళ.. తమ గ్రామం మీదుగా వెళుతున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసేందుకు వల్లాపురం గ్రామవాసులు బారులు తీరారు. దీంతొ ఆయన అక్కడికి చేరుకున్న అందరిని పేరుపేరునా పలకరిస్తూ.. ఆత్మీయంగా మాట్లాడారు. అంతేకాక..ఇందిరమ్మ రాజ్యం.. ప్రజా ప్రభుత్వంలో మీ సమస్యలు తీరిపోతాయి.. ఇండ్లు, రేషన్ కార్డులు వస్తాయి అని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. అయితే రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినా.. మధిర ప్రజలకు మాత్రం ఆయనే పెద్దకొడుకు అని వల్లాపురం గ్రామవాసులు అంటున్నారు.  ఉప ముఖ్యమంత్రి అయినా కూడా అదే ఆత్మీయత.. అదే ఆప్యాయతతో భట్టి విక్రమార్క గ్రామస్తులను పలకరించారు.

మరోవైపు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రైతు భరోసా పథకం గురించి కీలక విషయాలను వెల్లడించారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న తమ ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల ఆధారంగా ఈ పథకాన్ని అమలు చేస్తుందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఆత్మీయ భరోసా, రైతు భరోసా వంటి పథకాల ద్వారా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.

భూమి యాజమాన్యంపై ఆధారపడే ఈ పథకంలో, వ్యవసాయ భూములకు ఎకరాకు రూ.12 వేలు చెల్లిస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖ నుంచి వచ్చే రికార్డుల ఆధారంగా పథకం లబ్ధిదారులను గుర్తిస్తామన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఈ పథకాల అమలులో పారదర్శకతను పెంచేందుకు, గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా సెంటు భూమిలేని వ్యవసాయ కూలీలు, కనీసం 20 రోజుల పాటు ఉపాధి హామీ పథకంలో పని చేసినవారికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఈ పథకాల ప్రధాన లక్ష్యమని, గ్రామస్థాయిలో అధికారుల సమన్వయంతో పథకాలను విజయవంతంగా అమలు చేస్తామన్నారు.

Read Also: ISRO : ఇస్రో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డా.వి.నారాయణన్

 

 

  Last Updated: 14 Jan 2025, 04:15 PM IST