Site icon HashtagU Telugu

Deputy CM Bhatti : కాంగ్రెస్ పార్టీ రైతులు, కార్మికుల పక్షపాతి : భట్టి

Telangana Deputy Cm Bhatti Vikramarka Mallu Kerala Farmers

Deputy CM Bhatti : ఆహార భద్రత, సాంస్కృతిక వారసత్వానికి రైతులు సంరక్షకులు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. తెలంగాణ, కేరళ రాష్ట్రాలలో వ్యవసాయం ఒక జీవన విధానంలా ఉంటుందని చెప్పారు. అలాంటి వ్యవసాయ రంగం నేడు అకాల వర్షాలు, పెరిగిన పెట్టుబడులు, మార్కెట్ ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు, మారిన వాతావరణ ప్రభావం వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు.  కేరళ రాష్ట్రం కోజీకోడ్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రైతులు, కార్మికుల మహాసభలో భట్టి విక్రమార్క ప్రధాన వక్తగా ప్రసంగించారు.

Also Read :ISRO Vs Pakistan : రంగంలోకి ఇస్రో.. పాకిస్తాన్‌పైకి ‘ఈఓఎస్-09’ అస్త్రం

గిట్టుబాటు ధరల కల్పనలో కాంగ్రెస్ విజయం

‘‘రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే విషయంలో కాంగ్రెస్ పార్టీ విజయం వేసింది. 1965లో లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరల  కమిషన్(APC)ను స్థాపించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల పాలనా కాలంలో వ్యవసాయ ధరల కమిషన్‌ను  మరింత బలోపేతం చేశారు. ఇందిరాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి వంటి నేతల సారథ్యంలో హరిత విప్లవం(Deputy CM Bhatti) సాకారమైంది. అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలు, మెరుగైన నీటిపారుదల వ్యవస్థ, ఎరువులు అందుబాటులోకివచ్చాయి. ఈ చర్యల మూలంగా మన దేశంలో ధాన్యం ఉత్పత్తి 55 మిలియన్ టన్నుల నుంచి 1978- 79 నాటికి 131 మిలియన్ టన్నులకు పెరిగింది.  ఈ పరిణామం కేవలం వ్యవసాయం వృద్ధికే కాదు.. గ్రామీణ ఉపాధిని, ఆర్థిక శక్తిని బలోపేతం చేసింది’’  అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ‘‘చరిత్రలో ఒక విషయం క్లియర్‌గా ఉంది.. స్వాతంత్య్రం అనంతరం వ్యవసాయ రంగం అభివృద్ధికి కట్టుబడి కాంగ్రెస్ పని చేసింది’’ అని ఆయన చెప్పారు.  ‘‘భారతదేశ ఆర్థిక నిర్మాణంలో వ్యవసాయ రంగ భాగస్వామ్యం క్రమంగా తగ్గుతోంది. 2016లో  ఇది 17.5 శాతం ఉండగా, ప్రస్తుతం అది 14 శాతంగా ఉంది. అయినప్పటికీ సగం జనాభా వ్యవసాయ రంగం తోనే ముడి వేసుకుని ఉంది’’ అని డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు.

Also Read :Tourist Destinations: ఉగ్ర‌దాడి.. కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం!

రైతులను స్వతంత్రులను చేసేందుకే రుణమాఫీ

‘‘రైతులను స్వతంత్రులను చేసేందుకు రుణమాఫీ అవసరం. 2008లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం 71,000 కోట్ల రుణాలను మాఫీ చేసింది. దీని ద్వారా దేశంలో 3.68 కోట్ల మంది రైతులకు ఉపశమనం కలిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఆశీర్వాదంతోనే ఏర్పడింది. ఇప్పటివరకు 21వేల కోట్ల రుణాలను మాఫీ చేశాం. రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు రూ.12,000 పెట్టుబడి మద్దతుగా అందిస్తున్నాం, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ పంపిణీ చేస్తున్నాం.  సన్నధాన్యం సాగుచేసిన రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. 10,547 కోట్ల విలువైన పంటల సేకరణ చేస్తున్నాం.  రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఇవన్నీ చేపట్టింది’’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు.

కార్మికుల హక్కుల కోసం పోరాటం 

‘‘స్వాతంత్ర సమరయోధుల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్మికుల హక్కుల కోసం పోరాడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16,19, 23, 24, 39, 41, 42, 43, 43 ఏ, 54 కాంగ్రెస్ ప్రభుత్వ ప్రేరణతోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రతి గ్రామస్తునికి 100 రోజుల ఉపాధి హామీని కల్పించింది. ప్రపంచంలోనే ఇది ప్రధమ నిబంధన.  ఈ పథకం గ్రామీణుల వేతనాలు పెంచింది, వలసలను తగ్గించింది. వ్యవసాయ రంగానికి తోడ్పాటును అందించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి ఉపాధి, ఆదాయాన్ని స్థిరంగా అందిస్తున్నాం. అసంఘటిత రంగ కార్మికులకు డిజిటల్ నమోదు ద్వారా బీమా, పెన్షన్ వంటి సహకారం అందిస్తున్నాం. ఆత్మీయ రైతు భరోసా పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఎకరానికి 12,000 ఆర్థిక సహాయం అందిస్తున్నాం’’ అని భట్టి విక్రమార్క చెప్పారు. ‘‘కేరళ భూమి సాధారణమైనది కాదు. త్యాగాలు, పోరాటలతో ఈ గడ్డ పునీతమైంది. పున్నప్ర, వయలార్ వంటి ప్రజా ఉద్యమ కారులు వ్యవసాయ కూలీల హక్కుల కోసం చేసిన పోరాటాలు మరువలేనివి’’ అని ఆయన తెలిపారు. ‘‘భారత జాతీయ కాంగ్రెస్ రైతులు, కార్మికుల వెంట నడిచింది.  గాంధీజీ స్వరాజ్య పిలుపు నుంచి కేరళ భూ సంస్కరణల వరకు ఇది స్పష్టమైంది. గౌరవం అనేది ఒకరు ఇచ్చేది కాదు, అది అందరికీ లభించాల్సిన హక్కు’’ అని డిప్యూటీ సీఎం చెప్పారు.  ఈ సమావేశంలో ఎంపీ ఆంటోనీ జోసఫ్, ఎమ్మెల్యే సన్నీ జోసెఫ్, డీసీసీ అధ్యక్షుడు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.