Deputy CM Bhatti : నిరుద్యోగ యువతకు మూడు అంచెల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. చదువుకున్న ప్రతి వ్యక్తి మేధస్సును సమాజానికి అందించాలన్నదే తమ ప్రజా ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా గత బీఆర్ఎస్ సర్కారు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిందని ఆయన ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ సర్కారు పదేళ్లు అధికారంలో ఉండి, ఒక్కసారి కూడా గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేదని విమర్శించారు.వైరా నియోజకవర్గంలో నిర్వహించిన జాబ్ మేళాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. ఈ జాబ్ మేళా ద్వారా ఒకే రోజు 5వేల ఉద్యోగ నియామకాలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ఇప్పటివరకు 56 వేల ఉద్యోగాలు ఇచ్చామని, మరో 30 వేల ఉద్యోగ నియామకాలకు కసరత్తు చేస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు.
Also Read :New Covid Variants: మరో రెండు కొత్త కొవిడ్ వేరియంట్లు.. ఆస్పత్రులను రెడీ చేస్తున్న రాష్ట్రాలు
జూన్ 2న రాజీవ్ యువ వికాసం సాంక్షన్ లెటర్లు
‘‘బహుళ జాతి కంపెనీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వాటి ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది యువతకు ఉపాధి లభిస్తుంది. ప్రైవేటు రంగంలోని ఉద్యోగ అవకాశాలతో జాబ్ మేళాలను మేం నిర్వహిస్తున్నాం. ఉద్యోగ అవకాశాలు లభించని యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమల్లోకి తెచ్చాం. దీని ద్వారా రూ.9 వేల కోట్ల రుణాలు ఇవ్వబోతున్నాం. జూన్ 2న 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం సాంక్షన్ లెటర్లను పంపిణీ చేస్తాం’’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) చెప్పారు. నిరుద్యోగ యువతీ యువకుల ఆవేదనను ఆలకించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మూడు అంచెల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందన్నారు.
Also Read :Shami- Iyer: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ!
రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం
‘‘బడ్జెట్లో రైతు భరోసాకు 18 వేల కోట్ల రూపాయలు కేటాయించాం. రైతులకు 21 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం’’ అని డిప్యూటీ సీఎం చెప్పారు. ‘‘మా హయాంలోని ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం’’ అని ఆయన వెల్లడించారు. దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పదేళ్లు రాష్ట్ర ఖజానాను లూటీ చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
‘‘ఆడవాళ్లను చెట్టుకు కట్టేసి కొట్టిన దారుణాలను బీఆర్ఎస్ పాలనలో చూశాం’’
‘‘ఆడవాళ్లను చెట్టుకు కట్టేసి కొట్టిన దారుణాలను బీఆర్ఎస్ పాలనా కాలంలో చూశాం. గిరిజనులకు ఈ దుస్థితి ఉండొద్దని భావించిన ప్రజా ప్రభుత్వం ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు పొందిన భూములను సౌర విద్యుత్ ద్వారా సాగులోకి తీసుకురావడానికి రూ.12,600 కోట్లతో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా గిరిజన రైతులు తమ భూములను చదును చేయించుకోవచ్చు. బోర్లు, మోటారు, డ్రిప్పు, స్ప్లింకర్లను పొందొచ్చు. ఈ పథకం కింద కొన్ని మొక్కలను ఉచితంగా రైతులకు అందిస్తారు’’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ‘‘నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభిస్తున్నాం. 60 యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణానికి ఒకేసారి 11, 600 కోట్లు కేటాయించాం. వీటి ద్వారా నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన విద్య ఉచితంగా లభిస్తుంది’’ అని భట్టి చెప్పారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం
‘‘గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నాం. బీఆర్ఎస్ అటకెక్కించిన ఆరోగ్య శ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యాక్టివేట్ చేసింది. దాని లిమిట్‌ను 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలకు పెంచింది. మహిళా సంఘాలకు గత పది సంవత్సరాలు వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండా గత పాలకులు గాలికి వదిలేశారు. మేం ఈ ఏడాదిలోనే 21 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చాం’’ అని డిప్యూటీ సీఎం భట్టి వివరించారు.