Site icon HashtagU Telugu

Deputy CM Bhatti: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన డిప్యూటీ సీఎం భ‌ట్టి.. త్వ‌ర‌లోనే మ‌రో 30 వేల ఉద్యోగాలు!

Deputy CM Bhatti

Deputy CM Bhatti

Deputy CM Bhatti: తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Deputy CM Bhatti) తెలిపారు. ఆదివారం మధిరలో వందల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గత పాలకులు రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పగించారని, అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ వెనుకడుగు వేయలేదన్నారు. గతంలో పదేళ్లపాటు సన్న బియ్యం గురించి మాటలే చెప్పారు తప్ప అందించలేదని విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వం గత ఉగాది నుంచి 90 లక్షల రేషన్ కార్డు హోల్డర్లకు 2.85 కోట్ల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. కొత్త రేషన్ కార్డులతో కలిపి 1 కోటి కార్డు హోల్డర్లకు, 3.10 కోట్ల మందికి సన్న బియ్యం అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమానికి సంవత్సరానికి 13,525 కోట్లు ఖర్చు చేస్తున్నామని, పేదల పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఇది చాటుతుందని ఆయన అన్నారు. ఈ పథకం దేశంలో ఎక్కడా లేని విధంగా అమలవుతోందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Also Read: Pawan Wife : తిరుమలకు చేరుకున్న పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా

సన్న బియ్యం పంపిణీతో పాటు, సన్నధాన్యం సాగు చేసే రైతులకు 2,675 కోట్ల బోనస్ అందిస్తున్నామని భట్టి వెల్లడించారు. రైతు రుణమాఫీ కోసం రూ. 21,000 కోట్లు, రైతు భరోసాకు రూ. 18,000 కోట్లు, 24 గంటల ఉచిత విద్యుత్‌కు రూ. 12,500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలతో పాటు సన్న బియ్యం పంపిణీకి అదనంగా 13,525 కోట్లు వెచ్చిస్తున్నామని వివరించారు.

యువత కోసం 56,000 ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పటికే భర్తీ చేశామని, మరో 30,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని ఆయన తెలిపారు. నిరుద్యోగ యువత కోసం రూ. 6,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించామన్నారు. ఈ పథకం కింద దరఖాస్తుల గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగించినట్టు, జూన్ 2 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా అనుమతి పత్రాలను పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ పథకంలో శిక్షణ, గ్రౌండింగ్ కోసం సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భట్టి కోరారు.