KTR and Harish: ఉపముఖ్యమంత్రి సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్, హరీశ్

సిసోడియాను అరెస్టు చేయడం కక్షసాధింపు చర్యల్లో భాగమని తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు అన్నారు.

Published By: HashtagU Telugu Desk
KTR harish Rao

KTR harish Rao

ఢిల్లీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమని తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు అన్నారు. ‘‘సిసోడియా అరెస్టును భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తోంది. రాజకీయంగా ఆమ్ ఆద్మీపార్టీని ఎదుర్కోలేక తప్పుడు కేసుల్లో ఆప్ నాయకత్వాన్ని ఇరికించే ప్రయత్నం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇటీవల ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘెరంగా దెబ్బతిన్న బీజేపీ కేవలం కక్షసాధింపు చర్యగా ఆప్ నేతలపై అభియోగాలు మోపి అరెస్టులు చేస్తోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అర్థబలాన్ని, అంగబలాన్ని ఉపయోగించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నం చేసింది. కార్పొరేషన్లో మేయర్ ఎన్నిక సందర్భంగా బీజేపీ ఎంత నీచంగా వ్యవహరించిందో.. దేశమంతా చూసింది’’ అని కేటీఆర్, హరీశ్ రావు అన్నారు.

‘‘ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకున్నది. ఆప్ ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నది. రాజకీయంగా ఆప్ను ఎదుర్కోలేక సీబీఐని అడ్డంపెట్టుకొని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిని లిక్కర్ స్కాంలో ఇరికించి అరెస్టు చేసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థకు కళంకం తెచ్చేలా బీజేపీ వ్యవహరిస్తున్నది. దేశంలో ఈడీ, సీబీఐ, ఐటీలతో ప్రత్యర్ధి, ప్రతిపక్ష పార్టీలను బీజేపీ బెదిరిస్తోంది. బీజేపీ ఆటలు సాగవు. ప్రజలు ఆపార్టీకి బుద్దిచెప్పే రోజులు అతిత్వరలోనే రాబోతున్నాయి’’ అని కేటీఆర్, హరీశ్ రావు హెచ్చరించారు.

  Last Updated: 26 Feb 2023, 10:24 PM IST