Site icon HashtagU Telugu

HYDRA : మాదాపూర్‌లో కూల్చివేతలు.. 400 కోట్ల విలువైన భూమి కాపాడిన హైడ్రా

Demolitions in Madhapur.. Hydra saved land worth 400 crores

Demolitions in Madhapur.. Hydra saved land worth 400 crores

HYDRA : రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లంలోని మాదాపూర్ జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో చోటు చేసుకున్న అక్రమ కబ్జాలపై అధికార యంత్రాంగం గట్టిగా స్పందించింది. హైద్రాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ (HYDRA) గురువారం ఉదయం భారీ చర్యలకు శ్రీకారం చుట్టింది. పార్కులు, రహదారులు, ప్రభుత్వ భూములపై చోటు చేసుకున్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. మొత్తం 16,000 గజాల స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి విముక్తం చేశారు. ఈ భూముల అంచనా విలువ సుమారు రూ.400 కోట్లు ఉంటుంది.

అనుమతులు ఉన్న లేఅవుట్‌లోనే అక్రమ కబ్జాలు

1995లో అనుమతుల కోసం దరఖాస్తు చేసి, 2006లో రెగ్యులరైజేషన్ పొందిన జూబ్లీ ఎన్‌క్లేవ్ లేఅవుట్ మొత్తం 22.20 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో సుమారు 100 ప్లాట్లకు అనుమతులు ఉన్నా లేఅవుట్‌లోని పబ్లిక్ యుటిలిటీ స్థలాలు ముఖ్యంగా 4 పార్కులలో రెండు (సుమారు 8,500 గజాలు) కబ్జా అయ్యాయి. అంతేగాక, 5 వేల గజాల రోడ్డు స్థలాన్ని కూడా ఆక్రమించినట్టు హైడ్రా నిర్ధారించింది.

జైహింద్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు

జూబ్లీ ఎన్‌క్లేవ్‌లోని ఓ స్థలాన్ని జైహింద్‌రెడ్డి అనే వ్యక్తి తన పేరుతో ఆక్రమించుకొని, అందులో హోటల్ షెడ్ నిర్మించి అద్దెకి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ హోటల్‌ తో పాటు అక్కడే భారీ హోర్డింగ్ పెట్టి నెలకు రూ.4 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడని లేఅవుట్ ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలపై గతంలో జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చినప్పటికీ, జైహింద్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు సమాచారం.

ప్రజావాణిలో ఫిర్యాదుతో స్పందించిన హైడ్రా

లేఅవుట్‌కు సంబంధించిన ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, అధికారులు వెంటనే సర్వే నిర్వహించి ఆక్రమణలు నిజమేనని గుర్తించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు గురువారం ఉదయం బలగాలతో అక్కడకు చేరుకొని, హోటల్ షెడ్‌తో పాటు ఇతర అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

పార్కులపై బోర్డులు, ఫెన్సింగ్

కూల్చివేతల అనంతరం ఆ స్థలాల్లో పార్కుల ఉన్నతిని గుర్తించేలా బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసి భవిష్యత్తులో మళ్లీ ఎవరూ ఆక్రమించకుండా చర్యలు చేపట్టారు. ఆక్రమణలకు పాల్పడ్డవారి పై పోలీస్ కేసులు నమోదు చేయనున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు.

యూఎల్‌సీ భూములు ప్రభుత్వానిదే..ప్రతినిధుల వాదన

జూబ్లీ ఎన్‌క్లేవ్ ప్రతినిధులు మాట్లాడుతూ..2006లో రెగ్యులరైజ్ అయిన లేఅవుట్ తర్వాత అకస్మాత్తుగా ఎలా రద్దయిందో స్పష్టత లేదని, యూఎల్‌సీ కిందకు వచ్చే భూములు ప్రభుత్వానికి చెందినవే అయినప్పుడు మధ్యలో జైహింద్‌రెడ్డికి ఎలా చెందాయో అనుమానమని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయ‌నపై అనేక ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఉన్నట్టు వారు తెలిపారు. ఈ చర్యలతో, మాదాపూర్ పరిసరాల్లో అక్రమ కబ్జాలపై అధికారులు తీవ్రమైన సంకేతం పంపినట్టయింది. హైడ్రా చర్యలు భవిష్యత్తులో ఇలాంటి ఆక్రమణలను నిరోధించేందుకు మార్గసూచిగా నిలవనున్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.

Read Also: Vote Chori : ‘ఓట్ చోరీ’ పై కాంగ్రెస్ వీడియో వైరల్