Kavitha Liquor Scam: ఢిల్లీ మద్యం స్కామ్ లో ‘కవిత’ హస్తం!

ఢిల్లీ మద్యం పాలసీ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నేతల పేర్లు వినిపిస్తుండగా,

  • Written By:
  • Updated On - August 22, 2022 / 11:07 AM IST

ఢిల్లీ మద్యం పాలసీ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నేతల పేర్లు వినిపిస్తుండగా, తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత పేరు వినిపిస్తోంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రమేయం ఉన్న కోట్లాది రూపాయల మద్యం పాలసీ కుంభకోణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించారని బిజెపి ఆరోపించింది. దేశ రాజధానికి కొత్త మద్యం పాలసీని అమలు చేయడంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సిసోడియాతో పాటు హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్రన్ పిళ్లై సహా ఇతరులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేసింది. దేశ రాజధానిలో బిజెపి మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సర్సా విలేకరుల సమావేశంలో ఆరోపించారు “ఒబెరాయ్ హోటల్‌లో సమావేశాల్లో కవిత పాల్గొంది. దక్షిణాది నుండి మద్యం వ్యాపారులను తీసుకువచ్చింది. మాగుంట కుటుంబ సభ్యుల పేరుతో మద్యం లైసెన్సుల కోసం ముందుగా డబ్బులు చెల్లించారు. పంజాబ్, గోవా ఎన్నికలకు కూడా ముందుగానే డబ్బులు ఇచ్చారు.

పంజాబ్‌లోని డిస్టిలరీని సీల్ చేయకుండా పొందేందుకు కవిత సిసోడియాకు 4.5 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని, అందులో 3.5 కోట్ల రూపాయలను నగదు రూపంలో చెల్లించి క్రెడిట్ నోట్ తీసుకున్నారని ఆరోపించారు. “ఇవన్నీ ఇవ్వడం, తీసుకోవడంలో కవిత పాత్ర ఉంది. ఆమె సమావేశాలు నిర్వహిస్తోంది. చద్దా కుటుంబాన్ని కూడా కలుసుకుంది, డబ్బు తీసుకుని, వారి ఫ్యాక్టరీకి సీలు వేయలేదు” అని బీజేపీ నేత ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌కు చెందిన గండ్ర ప్రేంసాగర్‌తో కలిసి పిళ్లై ఏర్పాటు చేసిన రాబిన్ డిస్టిలరీస్‌పై విచారణ కొనసాగుతోందని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఫైనాన్స్‌ రంగంలో ప్రేంసాగర్‌ ఏర్పాటు చేసిన పలు కంపెనీలపై సీబీఐ ఆరా తీస్తోంది. ఇటీవల నిజామాబాద్ వెలమ సంఘానికి కోటి రూపాయల విరాళం ఇచ్చినట్లు ప్రేంసాగర్ దృష్టిని ఆకర్షించారు. ఆయన మరో అధికార పార్టీ ఎమ్మెల్సీకి సమీప బంధువు అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

టీఆర్‌ఎస్‌ పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి అల్లుడు సృజన్‌రెడ్డి ఆర్థిక లావాదేవీలను కూడా సీబీఐ తనిఖీ చేస్తోంది. నగరానికి చెందిన ఫార్మా కార్పొరేట్‌తో కలిసి సృజన్‌రెడ్డి దేశ రాజధానిలో మద్యం వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భారీ ప్యాకేజీని పొందిన సృజన్‌రెడ్డికి చెందిన సివిల్ కాంట్రాక్టు సంస్థ కూడా స్కానర్‌లోకి వచ్చింది. కాగా, ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనపై దేశ రాజధానిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన సమావేశాలకు కేసీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఆరోపించారు. మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి కేసీఆర్ ఫ్యామిలీ ఢిల్లీ కోసం ప్లాన్ సిద్ధం చేశారు’’ అని వర్మ పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అర్థరాత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ “మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుటుంబం” ప్రమేయం ఉందని తాను కూడా కథనాలను చూశానని’’ ఆయన అన్నారు.