Moaist Sujatha (Kalpana): అపరేషన్ కగార్ కింద జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మావోయిస్ట్ పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మహిళా అగ్రనేత సుజాత, అలియాస్ కల్పనను, పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఆమె మావోయిస్ట్ దివంగత అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు, అలియాస్ కిషన్ జీ భార్య. కొత్తగూడెంలో ఆమెను పోలీసులు పట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమెను హైదరాబాద్‌కు తరలించినట్లు తెలుస్తోంది. సుజాతపై కోటి రూపాయల రివార్డ్ కూడా ఉంది.
అనారోగ్యంతో బాధపడుతున్న సుజాత, బస్తర్ అడవులను వదిలి భద్రాద్రి కొత్తగూడెం ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చినప్పుడు పోలీసులు ఆమెను అరెస్టు చేసినట్లు సమాచారం. మహబూబాబాద్ బస్టాండ్ వద్ద కూడా ఆమెను అరెస్టు చేసినట్లు మరో ప్రచారం ఉంది. సుజాత, మైనభాయి, పద్మ, ఝాన్సీబాయి వంటి మావోయిస్టు నాయకులతో సుమారు 43 సంవత్సరాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
సుజాత, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలిగా మరియు సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇంచార్జీగా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్‌లో కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఆమె, తెలంగాణ పోలీసులకు పట్టుబడింది. సుజాత భర్త కిషన్ జీ, 2011లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. కిషన్ జీ స్వస్థలం పెద్దపల్లి జిల్లా, ఆయన సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ కూడా ఉద్యమంలో కొనసాగుతున్నాడు.
కిషన్ జీ మృతి తరువాత, సుజాత కోసం పోలీసులు శోధిస్తున్నారు. ఆమె ప్రస్తుతం 60 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. అయితే, సుజాత అరెస్టుపై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. సుజాత లొంగిపోయిందా? లేదా పోలీసుల అడ్డుకోవడమేనా? అన్న దానిపై స్పష్టత లేదు. ఆరోగ్య సమస్యలతో సుజాత, మహబూబ్‌నగర్‌కు చేరుకుని అక్కడ తన పరిచయాల ద్వారా లొంగిపోయేందుకు ప్రయత్నించారని సమాచారం. మరోవైపు, దండకారణ్యం, అబూజ్‌మఢ్ అడవుల్లో పోలీసుల మరియు భద్రతా దళాల నిర్బంధం పెరిగిన నేపథ్యంలో, మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెంకు వస్తుండగా ఆమెను పోలీసులు పట్టుకున్నారు.