KTR: కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా.. కరెంట్ వెలుగుల బిఆర్ఎస్ కావాలా: కేటీఆర్

రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నదని  కేటీఆర్ అన్నారు.

  • Written By:
  • Publish Date - July 15, 2023 / 04:41 PM IST

రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నదని  భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో ఉన్న 95 శాతం మంది రైతన్నలకు మూడు గంటల విద్యుత్ సరఫరా చాలు అంటూ… ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని బిఅర్ఎస్ పార్టీ శ్రేణులను మంత్రి కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ పార్టీ కి మద్దతు  ఇస్తే ఉచిత విద్యుత్తు రద్దు చేస్తుందన్న మాటను ప్రజాబాహుళ్యంలోకి మరింతగా తీసుకువెళ్లేందుకు, టిఆర్ఎస్ పార్టీ మూడు పంటలు కావాలా… కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు కావాలా అన్న నినాదంతో కదం తొక్కాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న తెలంగాణ రైతన్న బతుకులో చీకట్లు నింపే కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు చాలు అన్న వాదన ప్రతి గ్రామంలో, ప్రతి రైతు ఇంట్లో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్ అన్నారు.

ఒకవైపు రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతన్నల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకువచ్చేందుకు రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటు వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఎంతగానో పాటుపడుతుందని తెలిపిన కేటీఆర్,  రైతుల పట్ల వ్యవసాయ రంగం పట్ల  తనుకున్న గుడ్డి వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తు అనుచితమంటు మాట్లాడిందన్నారు.  2001లో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు వ్యాఖ్యలను ప్రస్తావించిన కేటీఆర్, ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడే అని, అందుకే చంద్రబాబు రైతు, వ్యవసాయ వ్యతిరేక ఆలోచన విధానంతోనే ఉచిత విద్యుత్తుపైన అడ్డగోలుగా మాట్లాడారన్నారు. అందుకే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలుగు కాంగ్రెస్, చంద్రబాబు కాంగ్రెస్ అన్న విషయాన్ని ప్రజలకు తెలియచెప్పాలన్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచిత విద్యుత్తు వద్దు అంటూ కేవలం మూడు గంటల విద్యుత్ చాలు అంటూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని అందుకే తెలంగాణ రైతన్నలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కి వ్యతిరేఖంగా స్పందించారన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్తు రద్దు అవుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియచెప్పేలా 17వ తేదీ నుంచి పది రోజులపాటు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల వద్ద రైతు సమావేశాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. ప్రతి రైతు వేదిక వద్ద కనీసం 1000 మంది రైతులకు తగ్గకుండా ఈ సమావేశాన్ని నిర్వహించాలని, ఈ సమావేశ నిర్వహణ బాధ్యతను స్వయంగా పార్టీ ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేయాలన్నారు. ఒక ఎకరానికి ఒక గంట విద్యుత్ సరిపోతుందంటూ, 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతాంగాన్ని అవమానించడమే అని, అందుకే కాంగ్రెస్ పార్టీ వెంటనే తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ రైతు సమావేhyశాల్లో తీర్మానం చేయాలన్నారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పాలనలో ఉన్న కరెంటు కష్టాలను భారత రాష్ట్ర సమితి పాలనలో అందుతున్న కరెంటు పరిస్థితులను రైతులకు వివరించాలని పార్టీ శ్రేణులను కోరిన కేటీఆర్, కటిక చీకట్లో కాంగ్రెస్ పార్టీ కావాలా, రైతు జీవితాల్లో కరెంటు వెలుగులు నింపిన టిఆర్ఎస్ కావాలా తెలుసుకోవాలని రైతులను కోరాలన్నారు.

Also Read: Sai Pallavi: అమర్‌నాథ్ యాత్రలో సాయిపల్లవి, జీవితమే ఓ తీర్థయాత్ర అంటూ ఎమోషనల్!