హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద (Gulzar House fire Accident) బాధితులు సంచలన ఆరోపణలు చేశారు. మృతుల కుటుంబ సభ్యురాలు సంతోషి గుప్తా (Santhoshi Guptha ) ప్రభుత్వం, ఫైర్ సిబ్బంది, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే తమ కుటుంబాలను విపత్కర పరిస్థితికి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫైరింజన్ సకాలంలో రాకపోవడం, వచ్చిన వాహనాల్లో సరైన నీటి మోతాదులు లేకపోవడం, పైపులు లీకేజీ కావడం వల్ల మంటలు అదుపు చేయలేకపోయారని ఆరోపించారు. అంతేగాక అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరిన 42 నిమిషాల తరువాతే స్పందించారని వివరించారు.
Shubman Gill: గుజరాత్ టైటాన్స్ ఎందుకు ఓడిపోయింది?.. గిల్ సమాధానం ఇదే!
సహాయ చర్యలు తీసుకోవడంలో కూడా ఫైర్, వైద్య సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితురాలు తెలిపారు. అంబులెన్స్‌లు తక్కువ సంఖ్యలో రావడం, వచ్చిన వాటిలో ఆక్సిజన్, బెడ్స్‌కు బెల్టులు లేని పరిస్థితుల్లో క్షతగాత్రులను తరలించారని ఆరోపించారు. ఆసుపత్రిలో సైతం ఎఫ్‌ఐఆర్ కాపీ లేకపోతే చికిత్స ఇవ్వమన్న వైద్యుల తీరు వల్ల ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మృతుల్లో తన కుమార్తె హర్షిత ఉన్నదని, మరో 20 రోజుల్లో పుట్టినరోజు జరుపుకోవాల్సిందని కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పరిహారం ఇప్పటికీ అందలేదని సంతోషి గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం లభించకపోతే అలాంటి పరిహారం తమకు అవసరం లేదన్నారు. ప్రభుత్వ వ్యవస్థల విఫలం వల్లే ఈ ప్రమాదం పెద్ద విపత్తుగా మారిందని, ఇకనైనా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనపై సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరిపించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.