Police Firing: హైదరాబాద్‌లో దొంగలపై డీసీపీ చైతన్య ఫైరింగ్ – చాదర్‌ఘాట్‌లో ఉద్రిక్తత

సీపీ సజ్జనార్‌ (CP Sajjanar) సంఘటన స్థలాన్ని పరిశీలించి, గాయపడ్డ దొంగ ఒమర్‌పై 25 కేసులు నమోదయ్యాయని, అతనికి రౌడీషీట్‌ కూడా ఉన్నట్లు తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Police Firing

Police Firing

హైదరాబాద్‌: హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌లోని విక్టోరియా గ్రౌండ్‌ వద్ద జరిగిన కాల్పులు శనివారం నగరంలో కలకలం రేపాయి. సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ చైతన్య కార్యాలయ సమావేశం ముగించుకుని తిరిగి వస్తుండగా, ఇద్దరు దొంగలు ఆటోలో ప్రయాణికుల వద్ద నుంచి సెల్‌ఫోన్‌ దొంగిలించేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన డీసీపీ చైతన్య (DCP Chaitanya) తన వాహనాన్ని ఆపి, గన్‌మెన్‌తో కలిసి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో నిందితులు కత్తులతో గన్‌మెన్‌పై దాడి చేయడానికి యత్నించగా, డీసీపీ వారిని అడ్డుకునే ప్రయత్నంలో కిందపడ్డారు. దొంగలు దాడి కొనసాగించడంతో ఆత్మరక్షణలో డీసీపీ చైతన్య రెండు రౌండ్లు (two rounds) కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓమర్‌ అనే నిందితుడు చేయి, కడుపు వద్ద గాయపడగా, అతడిని మొదట నాంపల్లి కేర్‌ ఆసుపత్రికి తరలించి, తరువాత మెరుగైన చికిత్స కోసం బంజారాహిల్స్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

సీపీ సజ్జనార్‌ (CP Sajjanar) సంఘటన స్థలాన్ని పరిశీలించి, గాయపడ్డ దొంగ ఒమర్‌పై 25 కేసులు నమోదయ్యాయని, అతనికి రౌడీషీట్‌ కూడా ఉన్నట్లు తెలిపారు. మరో నిందితుడు కూడా గాయపడ్డాడని చెప్పారు. డీసీపీ చైతన్య మరియు ఆయన గన్‌మెన్‌ ధైర్యంగా వ్యవహరించారని సీపీ తెలిపారు.

ఒమర్‌పై ఇంతకుముందు రెండు సార్లు పీడీ చట్టం (PD Act) కింద కేసులు నమోదయ్యాయని, 2016లో కామటిపురం పోలీస్‌స్టేషన్‌లో, 2020లో హుస్సేనీ ఆలమ్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుల్లో ఏడాదిపాటు చంచల్‌గూడ జైలులో ఉన్నట్లు సీపీ వివరించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని చెప్పారు.

  Last Updated: 25 Oct 2025, 10:41 PM IST