Site icon HashtagU Telugu

Davos 2025: తెలంగాణకు రూ. 1,78,950 కోట్ల రికార్డు స్థాయిలో పెట్టుబడులు!

Davos 2025

Davos 2025

Davos 2025: దావోస్‌లో (Davos 202) పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడుల రికార్డు నమోదు చేసింది. దావోస్ లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోర‌మ్‌ సదస్సులో తెలంగాణ ప్ర‌భుత్వం రూ. 1,78,950 కోట్ల రికార్డు స్థాయి పెట్టుబడులు సాధించి ఔరా అనిపించింది. గ‌తేడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు మాత్ర‌మే వ‌చ్చిన‌ట్లు గ‌ణంకాలు చెబుతున్నాయి. అప్పటితో పోలిస్తే ఈసారి నాలుగు రెట్లకు మించి పెట్టుబడులు రావ‌డం గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌యం.

49,550 మందికి ఉద్యోగాలు కూడా ల‌భించ‌నున్నాయి. మొత్తం రూ.1,78,950 కోట్ల పెట్టుబడితో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం దావోస్ పర్యటనను ముగించింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో అమెజాన్ (AWS) రూ. 60,000 కోట్లు, సన్ పెట్రోకెమికల్స్ రూ. 45,500 కోట్లు, టిల్‌మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ రూ. 15,000 కోట్లు, మేఘా ఇంజినీరింగ్ రూ. 15,000 కోట్లు రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ప్ర‌భుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి.

Also Read: Electricity Consumers: విద్యుత్ వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ స‌ర్కార్‌!

దావోస్ వేదికపై ఈసారి తెలంగాణ రాష్ట్రం అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సారధ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్‌లో వివిధ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశాలన్నీ దాదాపు సక్సెస్ అయ్యాయి. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వటం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకుంది.

దేశ, విదేశాలకు చెందిన పేరొందిన ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించినట్లుగా భారీ పెట్టుబడులను సాధించింది. దావోస్‌లో వరుసగా మూడు రోజుల పాటు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు రాష్ట్రంలో దాదాపు 50 వేల మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.

హైద‌రాబాద్ చేరుకున్న సీఎం రేవంత్

దావోస్‌లో భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వ‌చ్చేలా చేసిన సీఎం రేవంత్ రెడ్డి బృందం శుక్ర‌వారం ఉద‌యం దావోస్ నుంచి హైద‌రాబాద్ చేరుకుంది. ఈ విష‌యం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు, నాయ‌కులు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ బృందానికి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. తెలంగాణకు రూ. 1,78,950 కోట్ల రికార్డు స్థాయి పెట్టుబడులు తీసుకురావడంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.