ప్రాణానికి ఎవ్వరూ ధర కట్టలేరు. కోట్లు ఖర్చు చేసినా పోయిన ప్రాణం తిరిగి రాదు. కానీ ఆధునిక కాలంలో మనుషుల ప్రాణానికి విలువ తగ్గిపోతోంది. చిన్న చిన్న కారణాలతోనే హత్యలు చేయడం చేస్తున్నారు. కన్న తల్లిదండ్రులు, పిల్లలు, భార్యభర్తలు వంటి బంధాలను కూడా మరచి క్షణిక కోపంలో దారుణాలకు పాల్పడుతున్నారు. కొద్ది క్షణాల సహనం లేకపోవడం వల్ల నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోని ఎస్.ఆర్. నగర్‌లో జరిగిన ఘటన ఈ పరిస్థితికి ఉదాహరణగా నిలిచింది.
Good News : ఇళ్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త
పోలీసుల సమాచారం ప్రకారం 82 ఏళ్ల వృద్ధురాలు లక్ష్మిని ఆమె కూతురు మాధవి (42) ట్యాబ్లెట్లు తీసుకోకపోవడం వల్ల కోపోద్రిక్తురాలై ఇనుపరాడ్డుతో కొట్టి చంపింది. ఇద్దరికీ మతిస్థిమితం లేని పరిస్థితి ఉండటంతో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఇదే కాకుండా ఇంతకుముందు కూడా జీడిమెట్లలో 16 ఏళ్ల అమ్మాయి తన తల్లిని ప్రేమకు అడ్డువచ్చిందని హతమార్చిన ఘటన, అలాగే జూలైలో ఓ కూతురు తన వివాహేతర బంధానికి అడొస్తున్నాడని తన తండ్రిని చంపేసిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ సంఘటనలు కుటుంబ సంబంధాల బలహీనత, భావోద్వేగ నియంత్రణ లోపం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తున్నాయి.
నిపుణుల ప్రకారం మానసిక సమస్యలు, అసహనం, కోపం, డిప్రెషన్ వంటి అంశాలు నేరాలకు దారితీస్తున్నాయి. కుటుంబ సంబంధాలు బలహీనపడటం, సామాజిక విలువలు తగ్గిపోవడం, వీడియో గేమ్స్, సినిమాలు హింస, ప్రతీకారం, నేర ప్రవర్తనను చూపించడం వంటి కారణాలు కూడా మనుషుల్లో నేర ప్రవృత్తిని పెంచుతున్నాయి. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు మానసిక ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం, కుటుంబ బంధాలను బలపరచడం, చిన్న వయసులోనే విలువల విద్య అందించడం వంటి చర్యలు అవసరం. సమాజం మొత్తం కలసికట్టుగా నైతిక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించకపోతే ఇలాంటి దారుణాలు మరింత పెరిగే అవకాశం ఉంది.