Dasoju Sravan: ‘సీఎం రేవంత్ కు దాసోజు లేఖ.. ప్రస్తావించిన అంశాలివే

  • Written By:
  • Updated On - April 15, 2024 / 06:41 PM IST

Dasoju Sravan: బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖను సంధించారు. లేఖలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ప్రస్తావిస్తూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆయన లేఖ ప్రస్తావించిన అంశాలు ఏమిటంటే.. ‘‘గౌరవనీయులై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 133వ జయంతి సందర్భంగా ఆయనను అవమానపరిచారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్మారక చిహ్నమైన ఆయన విగ్రహానికి పూలమాల వేయకుండా మీరు మీ ప్రభుత్వం ఆయనను అగౌరవ పరిచారు. కేవలం మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్‌ గారి మీద మీకున్న దురభిమానం, అహంకారం, మరియు ప్రతీకార రాజకీయాలతోనే మీరు అంబేద్కర్‌ గారిని అవమానపరిచారని అవగతమవుతున్నది. కావునా తక్షణమే మీరు మీ ప్రభుత్వం తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరుతున్నాను. మీరు మరియు మీ ప్రభుత్వం కూడా ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని అలాగే రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రాథమిక పౌర విధులను నెరవేర్చకుండా మీరు తుంగలో తొక్కారని నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా’’ అని దాసోజు అన్నారు.

‘‘మీరు మరియు మీ ప్రభుత్వం మన జాతీయ వీరుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ గారిని ఎలా అవమానించగలిగారు? డా.బి.ఆర్.అంబేద్కర్ గారు దళితుడు కాకపోయి ఉంటే ఆయనను అవమానించే నీచమైన పని మీరు చేసి ఉండేవారా? డా.బి.ఆర్.అంబేద్కర్‌ గారిని నిర్లక్ష్యం చేస్తూ, అగౌరవపరిచే మీ దారుణమైన చర్య మీ అగ్రవర్ణ దురహంకారాన్ని, భూస్వామ్య ఆధిపత్యాన్ని తెలియజేస్తుంది. మీరు మరియు మీ ప్రభుత్వం భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి అయినటువంటి డా.బి.ఆర్.అంబేద్కర్‌ గారినే ఈ విధంగా అవమానించారంటే ఇక మీ ఫ్యూడల్ పాలనలో బడుగు బలహీనవర్గాల పరిస్థితి ఏంటి?’’ అని దాసోజు ప్రశ్నించారు.

‘‘మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్‌ గారి విగ్రహాన్ని నిర్మించారు కాబట్టే మీరు రాజ్యాంగ బాధ్యతను విస్మరించారు అనుకోవాలా? లేక రాజకీయ ప్రతీకారం మరియు ద్వేషంతో మీరు ఈ చర్యకు పాల్పడ్డారనుకోవాలా? ఏది ఏమైనప్పటికీ.. మీరు, మీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అంబేద్కర్‌ గారిని నిర్లక్ష్యం చేయడం, అగౌరవపరచడం, ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాన్ని అలంకరించకపోవడం.. పూలమాల వేయకపోవడం డా. బి.ఆర్. అంబేద్కర్‌ గారిని మాత్రమే అవమానించడం కాదు.. ఇది తెలంగాణలోని ప్రతి పౌరుడిని మరియు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి అంబేద్కరిస్టును అవమానించడమే అవుతుంది’’ అని దాసోజు లేఖలో ప్రస్తావించారు.