Site icon HashtagU Telugu

Telangana: సీఎం రేవంత్ రెడ్డి లండన్ వెళ్లి తెలంగాణ పరువు తీస్తున్నాడు: దాసోజు

Dasoju Sravan

Dasoju Sravan

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. ఈ క్రమంలో అదానీతో కాంగ్రెస్ కు లింక్ పెడుతూ వ్యాఖ్యలు చేశాడు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో తెలంగాణలో పెట్టుబడులు పెడతామని అదానీ ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రాహుల్ గాంధీ కేంద్రంలో గౌతమ్ అదానీని తప్పుబడుతుంటే..సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో అదానీ గ్రూప్‌కు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారని విమర్శించాడు. అదానీపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని దాసోజు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన తర్వాత తెలంగాణలో అదానీ భారీ పెట్టుబడుల అంశం తెరపైకి వచ్చిందని ఆయన ఆరోపించారు.

తెలంగాణ భవన్‌లో పార్టీ నాయకుడు మన్నె క్రిశాంక్‌తో కలిసి విలేకరుల సమావేశంలో శ్రవణ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అబద్ధాల ఆధారంగా అధికారంలోకి వచ్చారని అన్నారు. మొత్తం పెట్టుబడులలో దాదాపు 30% గౌతమ్ అదానీకి చెందినవి. ఢిల్లీలో ఖుస్తీ, గల్లీలో దోస్తీ చేస్తున్నారని కాంగ్రెస్ ని విమర్శించారు. గౌతమ్ అదానీని విమర్శించిన రాహుల్ గాంధీ పార్లమెంటులో చేసిన ప్రసంగం యొక్క వీడియో క్లిప్‌ను కూడా శ్రవణ్ ప్లే చేశాడు. అదానితో మోడీ ప్రభుత్వానికి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ అదానీని జాతీయ మోసగాడు అని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ ఇప్పటికీ అదానీ గురించి మాట్లాడుతున్నారు. ఢిల్లీలో రాహుల్‌ అదానీపై ఎందుకు విమర్శించారో, రేవంత్‌రెడ్డి ఎందుకు ప్రచారం చేస్తున్నారో కాంగ్రెస్‌ స్పష్టం చేయాలి అని దాసోజు ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి విదేశాల్లో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడారని దాసోజు శ్రవణ్ విమర్శించారు. కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి దుర్మార్గమైన మాటలు మాట్లాడారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఐటీ ఎగుమతులను రూ.57 వేల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్లకు తీసుకు వెళ్లామన్నారు. ఐటీ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోతున్నారని దాసోజు విమర్శించారు. అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర గౌరవం పెంచే విధంగా మాట్లాడాలని సూచించారు.

Also Read: Shyamala Devi : వేణు స్వామి ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణం రాజు భార్య