BRS : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆరోపణల పర్వం ఊపందుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రొఫెసర్ కోదండరాంపై సీఎం చూపిస్తున్న ప్రేమ దిష్టిబొమ్మ మాత్రమేనని, అది మొసలి కన్నీరు కంటే ఎక్కువ కాదని ఆయన విమర్శించారు. నిజంగా కోదండరాంపై అభిమానం ఉంటే, వెంటనే సీఎం పదవి ఆయన్నే అప్పగించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. రెవంత్ రెడ్డికి నాయకత్వ లక్షణాలు లేవని, ఆయన కన్నా కోదండరాం అన్ని విధాలా ఉత్తమ నాయకుడని దాసోజు అభిప్రాయపడ్డారు. కోదండరాం నాయకత్వం, ఉద్యమశక్తి, ప్రజలతో ఉన్న అనుబంధం ఆయనను తక్షణమే ముఖ్యమంత్రి పదవికి అర్హుడిగా చేస్తాయి. కనీసం ఆయనను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలి అని అన్నారు. అలాగే, రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కోదండరాంకు బరిలో దించాలని సూచించారు.
Read Also: Doom Scroller : సోషల్ మీడియాలో స్క్రోలింగ్‌తోనే జాబు.? వైరల్ అవుతున్న “డూమ్-స్క్రోలర్” ఉద్యోగం
రెవంత్ రెడ్డి ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగాన్ని శ్రవణ్ తిప్పికొట్టారు. ఆయన మాట్లాడింది అంతా సొల్లు పురాణం. నిజంగా విద్యా వ్యవస్థపై ప్రేమ ఉంటే, వెంటనే ఓయూకు వెయ్యి కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలి” అంటూ ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. బడ్జెట్ లో మాటలకన్నా కేటాయింపులే ముఖ్యమని తేల్చిచెప్పారు. ప్రస్తుతం న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడతారని శ్రవణ్ ప్రశ్నించారు. “అదేంటంటే కేసు కోర్టులో ఉండగానే వ్యాఖ్యలు చేయడం ద్వారా న్యాయవ్యవస్థను అవమానిస్తున్నారు. ఇది న్యాయమూర్తుల పరంపరను అనాగరికంగా తక్కువచేయడమే అని అన్నారు. తెలంగాణ కోసం ఎందరో యువకులు ప్రాణాలర్పించిన సమయంలో రేవంత్ చంద్రబాబు నాయుడు వర్గంలో ఉన్నారని శ్రవణ్ గుర్తుచేశారు.
శ్రీకాంతాచారి, యాదయ్య వంటి వారు ఉద్యమం కోసం ప్రాణత్యాగం చేసినప్పుడు, రేవంత్ చంద్రబాబు పక్కనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఉద్యమ నాయకుడిలా ప్రవర్తించడం నాటకమే అంటూ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అప్పులు రూ. 3,50,520 కోట్లు మాత్రమేనని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి వెల్లడించారని శ్రవణ్ చెప్పారు. ఇప్పటి ప్రభుత్వం మాత్రం నిజాలు దాచే ప్రయత్నం చేస్తోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా అసత్యాలను ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు. చివరిగా, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందనే భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి అశాంతిగా ప్రవర్తిస్తున్నారని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్‌పై ఉన్న విశ్వాసం ఆయనకు బెంగలేకుండా లేదు. అందుకే ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు.