తెలంగాణ(Telangana)లో దసరా(Dasara)నే అతిపెద్ద పండగ. ఈ పండగనాడు రాష్ట్రవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. బంధుమిత్రులను కలిసి సంతోషాలు పంచుకుంటూ…షమీ పూజలు నిర్వహించి జమ్మిని బంగారంగా భావించి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇదేకాదు దసరా అంటేనే భారీగా విందులు. అయితే తెలంగాణలో జరిగే ఈ విందుల్లో మద్యానికి, నాన్ వెజ్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. పెగ్గు లేని దావత్ ఉండదు. బంధుమిత్రులతో కలిసి పెగ్గేస్తారు. ఇలాంటి సాంప్రదాయం తరాలుగా వస్తూనే ఉంది. ఈ ఏడాది కూడా దసరా సందర్భంగా రాష్ట్రంలో భారీగా మద్యం అమ్మకాలు (Liquor Sales) జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.
అక్టోబర్ నెల ప్రారంభం నుంచి 11వతేదీ వరకు రూ 1,057.42 కోట్ల మేర విలువైన 10.44 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు జరిగినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అదే విధంగా 17.59 లక్షల బీర్ల కేసులు అమ్మకాలు జరిగాయి. అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా ముందుండగా, కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. పండగ చివరి మూడు రోజులు అంతకు మించి అన్నట్లుగా అమ్మకాలు జరిగాయని, ఎక్సైజ్ డిపోల నుంచి రూ 205.42 కోట్ల మేర విలువైన మద్యం రిటైల్ దుకాణాలకు చేరిందని..డిమాండ్ మేరకు పూర్తి స్థాయిలో మద్యాన్ని అందించలేకపోయామని అధికారులు చెపుతున్నారు.
ఇక..పండుగ చివరి రోజైన శనివారం, ఆదివారం నాడు రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు లెక్కలు తేల్చాయి. మొత్తంగా ఈ 11 రోజుల్లో తెలంగాణలో దాదాపు గా వెయ్యి కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా అనూహ్యంగా రాష్ట్ర ఖజనాకు మద్యం అమ్మకాల ద్వారా తక్కువ వ్యవధిలోనూ భారీగా ఆదాయం సమకూరినట్లు లెక్కలు వేసుకుంటున్నారు.
Read Also : Minister Konda Surekha : గీసుగొండ వివాదం పై కొండా సురేఖ రియాక్షన్..