పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం: సీపీ సజ్జనార్

Telangana police  పెళ్లి పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేవలం ప్రేమ వ్యవహారాల్లోనే కాకుండా, పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో కూడా యువతులు మోసపోతుండటంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. నిశ్చితార్థం అయిన తర్వాత కూడా యువతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం మోసగాళ్లు తమ పంథాను మార్చుకున్నారని, ముందుగా సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, నిశ్చితార్థం జరిపించుకుని… ఆ తర్వాత పెళ్లి ఖాయమైంది కదా […]

Published By: HashtagU Telugu Desk
Hyderabad Commission of Police, V.C. Sajjanar

Hyderabad Commission of Police, V.C. Sajjanar

Telangana police  పెళ్లి పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేవలం ప్రేమ వ్యవహారాల్లోనే కాకుండా, పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో కూడా యువతులు మోసపోతుండటంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. నిశ్చితార్థం అయిన తర్వాత కూడా యువతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

ప్రస్తుతం మోసగాళ్లు తమ పంథాను మార్చుకున్నారని, ముందుగా సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, నిశ్చితార్థం జరిపించుకుని… ఆ తర్వాత పెళ్లి ఖాయమైంది కదా అనే చనువును ఆసరాగా చేసుకుని యువతులతో సన్నిహితంగా మెలగడం, మాయమాటలతో వారిని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తూ శారీరకంగా లోబరుచుకోవడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని సజ్జనార్ తెలిపారు. తీరా పెళ్లి సమయం దగ్గర పడ్డాక, తమ అసలు రంగును బయటపెడుతూ… అదనపు కట్నం కావాలని, లేదంటే పెళ్లి రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే, సమాజంలో పరువు పోతుందనే భయంతో చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నారు. బాధితుల మౌనాన్ని ఆసరాగా చేసుకుని ఈ కేటుగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారని షీ టీమ్స్ స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. నిశ్చితార్థం అయినంత మాత్రాన గుడ్డిగా నమ్మకుండా, అబ్బాయి ప్రవర్తన, అతని స్నేహితులు, అతని అలవాట్లపై ముందే ఆరా తీయాలని సూచించారు. ముఖ్యంగా పెళ్లికి ముందే శారీరక సంబంధం కోసం ఒత్తిడి చేస్తే, అది కచ్చితంగా ప్రమాద సంకేతమని గ్రహించాలని హెచ్చరించారు.

ఇలాంటి మోసగాళ్ల చేతిలో చిక్కుకున్న వారు భయపడకుండా ముందుకు రావాలని, బాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసానిచ్చారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555 కు గానీ, లేదా అత్యవసరంగా డయల్ 100కు గానీ సమాచారం అందించాలని సూచించారు.

  Last Updated: 23 Feb 2026, 11:08 AM IST