BRS Party: దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలి: పాడి కౌశిక్ రెడ్డి

  • Written By:
  • Updated On - March 23, 2024 / 05:10 PM IST

BRS Party: బిఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన దానం నాగేందర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయనను ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు ఉందని వెంటనే ఆయనను సస్పెండ్ చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన అవసరం తెలంగాణ స్పీకర్ కు ఉందని వెంటనే దానం నాగేందర్ పై వేటు వేయాలన్నారు. దానం నాగేందర్ విషయంపై ఇటీవల స్పీకర్ ను కూడా కలిశామని ఆయన అన్నారు.

ఇటీవలే కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆడియో లీక్ అయిందని దానిలో హుజురాబాద్ నియోజకవర్గం తరఫున ప్రజలు తనను ఎన్నుకున్నప్పటికీ కల్యాణ లక్ష్మి చెక్కులు పంచకుండా చేయడానికి హుజురాబాద్ ఆర్డిఓ ఎమ్మార్వోలకు ఫోన్ చేసి బెదిరించడం సిగ్గుచేటు అన్నారు. మంత్రి వ్యవహార శైలి బాగాలేదని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు.

తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో కరీంనగర్ పార్లమెంటు లో బిఆర్ఎస్ జండా మొదటగా ఎగరబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లక్ష మెజారిటీతో కూడా గెలవబోతున్నామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులంతా కేసీఆర్ను ఎందుకు ఓడించామని బాధపడుతున్నారని అన్నారు. కెసిఆర్ పాలల్లో పది సంవత్సరాలు తెలంగాణలో ఒక ఎకరమైన ఎండిపోయిందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులతోపాటు యువకులంతా బిఆర్ఎస్ పార్టీ వైపే చూస్తున్నారని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తప్పక కాంగ్రెస్ కు గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. బిఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చి తాము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేనిపక్షంలో రానున్న రోజుల్లో భారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.