Site icon HashtagU Telugu

Cyber Crime: కరెంట్ బిల్ కట్టలేదని మెసేజ్.. లింక్ ఓపెన్ చేయగానే ఖాతాలోంచి సొమ్ము మాయం

Cyber Crime

Cyber Crime

సైబర్ నేరస్థులు (Cyber Crime) రోజుకో కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఒక మోసంపై జనంలో అవగాహన రాగానే రూటు మార్చి మరో కొత్త మోసానికి తెరలేపుతున్నారు. తాజాగా తెలంగాణలో ఇలాంటి కొత్త రకం మోసం బయటపడింది. విద్యుత్ బిల్లు చెల్లించలేదని మెసేజ్ పంపి, గ్రామస్థుడి బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్మును దుండగులు కాజేశారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి మండలం దేవునిపల్లికి చెందిన రాజేశ్వర్‌కు ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. మూడు నెలల కరెంట్‌ బిల్లు పెండింగ్‌ ఉందని, వెంటనే కట్టకపోతే సరఫరా నిలిపేస్తామని చెప్పాడు.

Also Read: EV Stations : ఎల‌క్ట్రిక్ వాహ‌నాల రీ చార్జి స్టేష‌న్ల ఏర్పాటులో ద‌క్షిణ మ‌ధ్య రైల్వే

విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగి మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని హెచ్చరించాడు. దీంతో ఆందోళన చెందిన రాజేశ్వర్ పవర్ సప్లై తీసేయొద్దని కోరాడు. దీంతో ఓ లింక్ పంపిస్తానని, దాని ద్వారా పెండింగ్ బిల్లు చెల్లించాలని దుండగుడు సూచించాడు. ఆ కేటుగాడు పంపిన లింక్ ను ఓపెన్ చేయగానే రాజేశ్వర్ ఖాతాలో నుంచి రూ.49 వేలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దాంతో జరిగిన మోసం గుర్తించిన రాజేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కరెంట్ బిల్లు కట్టకపోతే విద్యుత్‌ సిబ్బంది ఫోన్‌ చేయరు. ఇంటికే వచ్చి అడుగుతారు. లేదంటే స్థానిక లైన్ మెన్ వచ్చి విద్యుత్ సరఫరా ఆపేసి వెళ్లిపోతాడు. పెండింగ్ బిల్లు కట్టాక వచ్చి సరఫరా పునరుద్ధరిస్తాడని అధికారులు చెప్పారు.

 

 

Exit mobile version