Site icon HashtagU Telugu

Telangana Politics:టీఆర్ఎస్, బీజేపీ ‘ క్విడ్ ప్రో కో’

Bandi letter to cm kcr

Kcr Bandi

తెలంగాణ రాష్ట్ర సమితి, బీజేపీలు ఆసక్తికరమైన గేమ్ ఆడుతున్నాయి. పబ్లిక్‌లో రాజకీయ బాకులు విసురుకుంటున్నారు. కానీ పరోక్షంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ తరచుగా వారికి ఉన్న రహస్య సంబంధాన్ని బయట పెడుతుంది. ఇటీవల జరిగిన పరిణామాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఖరీఫ్ బియ్యం మొత్తం కొనుగోలు చేసేలా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కేంద్రం అదేశించలేదు. రాబోయే రబీ సీజన్ నుంచి ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేయబోమని నిర్దాక్షిణ్యంగా చెప్పింది. దీంతో బిజెపిపై టిఆర్ఎస్ ఒక రకమైన యుద్ధం ప్రకటించింది.

ప్రతిగా, బిజెపి ఇప్పుడు గులాబీ దళానికి వ్యతిరేకంగా ఎదురుదాడి ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని తమ పార్టీ ఎంపీలు, నాయకులు టీఆర్‌ఎస్‌ను గద్దె దించాలని అమిత్ షా దిశానిర్దేశం చేసాడు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పై అవినీతి ఆరోపణలు చేసిన లీడర్లను వేధింపులకు గురిచేయడాన్ని తప్పు బట్టాడు. టీఆర్ఎస్ కేంద్రం పై దాడికి దిగినప్పుడల్లా కేసీఆర్ అవినీతిని బయటపెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారట . ఇలా రెండు పార్టీల మధ్య ఏదో ఒక అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది.

గతంలో కేంద్రం వివాదాస్పద బిల్లులను పార్లమెంటులో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినప్పుడల్లా బీజేపీకి టీఆర్‌ఎస్ అండగా నిలిచింది. బహుశా వచ్చే ఏడాది రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో సంఖ్యాబలం తక్కువగా ఉంటే సమీప భవిష్యత్తులో మళ్లీ టీఆర్‌ఎస్‌ సహాయం అవసరం కావచ్చు. ఎందుకంటే, యూపీ ఎన్నికల ఫలితాలు అనూహ్యమైనవి.

రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఏకకాలంలో అధికారంలోకి వచ్చి ఏడేళ్లుగా గద్దెనెక్కిన విషయాన్ని గుర్తుంచుకోండి. టీఆర్‌ఎస్ పాలనలో అవినీతి జరిగిందని బీజేపీ నేతలకు సమాచారం ఉంటే, కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఇంతవరకు ఎందుకు దాడులు చేయలేదు? సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలు రాజకీయ అనుకూలతలకు అనుగుణంగా నడిచిన చరిత్ర ఉంది.
రెండు పార్టీలు కాంగ్రెస్ ను ఉమ్మడి శత్రువుగా చూస్తున్నాయి. ఆ పార్టీని పూర్తిగా లేకుండా చేయాలని టార్గెట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవన్నీ కాంగ్రెస్ చేస్తున్న వాదనకు బలం చేకూర్చింది. తెలంగాణలో అండర్‌డాగ్‌గా ఉన్న బిజెపి…కాంగ్రెస్‌ను పక్కకు నెట్టి, టిఆర్‌ఎస్‌కు సూత్రప్రాయ ప్రత్యర్థిగా చూడాలనుకుంటోంది. ఆ క్రమంలో బీజేపీ, టీఆర్ఎస్ కలసి విచిత్ర గేమ్ ఆడుతున్నాయి. మరి ఆ గేమ్ ను కాంగ్రెస్ ఎలా ఆటకట్టిస్తుందో చూడాలి.