Site icon HashtagU Telugu

Hyderabad : నాచారంలో అమాయక యువతిపై దారుణం

Nacharam

Nacharam

హైదరాబాద్ నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ (Nacharam Police Station) పరిధిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అంబేద్కర్ నగర్‌కు చెందిన దాసరి మహేందర్ అలియాస్ మహేష్ అనే కూలీదారుడు (28) ఓ అమాయక యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి, లైంగిక దాడికి పాల్పడి చివరికి ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాడు. ఇప్పటికే అతను వివాహితుడిగా ముగ్గురు పిల్లల తండ్రి అయినప్పటికీ, ఈ విషయాన్ని బాధిత యువతికి తెలియనివ్వలేదు. పెళ్లి చేసుకుంటానంటూ మాయమాటలు చెప్పి, ఆమెను నమ్మించి తన వశం చేసుకున్నాడు.

Lokesh : చదువుకోవాలన్న తపన..చిన్నారుల మనోభావాలకు స్పందించిన మంత్రి లోకేశ్

బాధిత యువతి నాచారం ప్రాంతానికి చెందినది. పోలీస్ రిక్రూట్మెంట్ కోసం శిక్షణ పొందుతున్న ఈ యువతిని మహేందర్ ప్రేమ పేరుతో మోసం చేశాడు. ఇంటికి పిలిచి లైంగిక దాడికి పాల్పడిన తరువాత ఆమెను బెదిరించి మౌనం పాటించేట్లు చేశాడు. అనంతరం ఆమె గర్భం రావడంతో బాధ్యత తీసుకోవాలని కోరినా, మహేందర్ తిరస్కరించాడు. తీవ్ర మనోవేదనకు లోనైన యువతి జూలై 2న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తులో మహేందర్ నేరం స్పష్టమైంది.

నాచారం పోలీస్ ఇన్‌స్పెక్టర్ రుద్రవీర్ కుమార్ తెలిపిన ప్రకారం.. మహేందర్ గతంలో NDPS చట్టం కింద కేసులో కూడా నిందితుడిగా ఉన్నట్లు తేలింది. బాధితురాలిపై లైంగిక దాడి, ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో అతనిపై BNS చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి జూలై 3న అతన్ని మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి న్యాయహిరాసతకు తరలించారు.