MLC Ticket : గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోటీచేసి గెలవడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి జూన్ 8లోగా ఉప ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నిర్వహణ హడావిడిలో ఉన్న కేంద్ర ఎలక్షన్ కమిషన్ త్వరలోనే ఈ ఉప ఎన్నికకు షెడ్యూలు రిలీజ్ చేయనుంది. ఈ నెల చివర్లో లేదా మే ఫస్ట్ వీక్‌లో షెడ్యూలు, నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
We’re now on WhatsApp. Click to Join
ఈ బైపోల్‌లో తప్పకుండా పోటీ చేయాలని సీపీఐ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉన్నందున ఆ పార్టీ నేతలతో చర్చించి నల్లగొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ స్థానాన్ని కోరాలని సీపీఐ(MLC Ticket) యోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా సీపీఐకి ఇవ్వనందున.. కనీసం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలని కోరనుంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముంది ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందనే విశ్వాసాన్ని సీపీఐ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
Also Read : Phone Tapping Den : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ గెస్ట్ హౌజ్ నుంచే ‘ఫోన్ ట్యాపింగ్’ !?
మూడేండ్ల క్రితం నల్లగొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో సీపీఐ తరఫున జయసారధి రెడ్డి, కాంగ్రెస్ తరఫున రాములు నాయక్, తెలంగాణ జనసమితి తరఫున ప్రొఫెసర్ కోదండరాం, స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీచేశారు. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. ఆనాడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ప్రొఫెసర్ కోదండరాం కూడా కాంగ్రెస్ పెద్దలతో టచ్‌లో ఉన్నారు. రాములు నాయక్ ఎలాగూ కాంగ్రెస్ నాయకుడే. సీపీఐ ఇప్పుడు కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నలుగురిలో ఒక్కరు మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. సీపీఐ ఈ స్థానం నుంచి జయసారధిరెడ్డికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ను కోరే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ప్రొఫెసర్ కోదండరాం పేరును గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఖరారు చేసినందున ఆయన పోటీలో ఉండరు. కాంగ్రెస్ నుంచి ఈ టికెట్ కోసం రాములు నాయక్, తీన్మార్ మల్లన్న మధ్య ప్రధాన పోటీ నెలకొంది. హస్తం పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయంపై వీరి భవితవ్యం ఆధారపడి ఉంటుంది.