Vemulawada : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపురం గోశాలలో కోడెల మరణాలు ఆగకుండానే కొనసాగుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వరుసగా కోడెలు మృత్యువాత పడుతున్న ఘటనల నేపథ్యంలో, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం మరో ఐదు కోడెలు మృతిచెందగా, గత రెండు రోజులుగా తీసుకుంటున్న చర్యలు ఫలితమివ్వకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. మృత కోడెల శవాలను తిప్పాపురం గ్రామంలోని మూల వాగులో పాతిపెట్టే క్రమంలో, గ్రామస్తులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. గీతా కార్మికులు, రైతులు ట్రాక్టర్‌ను అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఎల్లమ్మ గుడి సమీపంలో శవాలను పాతిపెట్టడం వల్ల దుర్వాసన భరించలేకపోతున్నామని వారు వాపోయారు. ఇదే విధంగా, వ్యవసాయ పనులకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, భూమి, నీరు కలుషితమవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో కోడెల మరణాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌తో పాటు దేవాదాయ శాఖ అధికారులు కూడా గోశాల సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. కానీ, వాటిని పట్టించుకోకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై భక్తులు మండిపడుతున్నారు. విహెచ్‌పి నేతలు స్పందిస్తూ .. ‘‘నేటినుంచి గోశాల కోడెల పంపిణీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగించాలి. లేకపోతే తీవ్ర నిరసనలు తప్పవు’’ అని హెచ్చరించారు. ఈ సంఘటనలపై అధికారులు వెంటనే స్పందించి గోశాల నిర్వహణలో పారదర్శకత తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Money Golmal: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌లో రూ.1.20 కోట్లు మాయం..