Telangana@Covid: తెలంగాణ జిల్లాల్లో కరోనా ఉధృతి.. మళ్లీ పెరుగుతున్న కేసులు

కరోనా దడ పుట్టిస్తోంది. తెలంగాణ లోని జిల్లాల్లోనూ కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

  • Written By:
  • Publish Date - July 3, 2022 / 03:30 PM IST

కరోనా దడ పుట్టిస్తోంది. తెలంగాణ లోని జిల్లాల్లోనూ కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా కొవిడ్ కొత్త కేసుల సంఖ్య 500 మార్క్ ను దాటింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 26వేల 976 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 516 మందికి పాజిటివ్ గా తేలింది.

వీటిలో అత్యధికంగా 261 కొత్త కేసులు హైదరాబాద్ జిల్లాలోనే బయటపడ్డాయి. గత కొన్ని వారాలుగా 1 లేదా 2 కేసులే బయటపడ్డ కొన్ని జిల్లాల్లో.. తాజాగా పదుల సంఖ్యలో పాజిటివ్ లు వెలుగు చూశాయి. ఈ జాబితాలోకి భద్రాద్రి కొత్తగూడెం (15 కేసులు), మంచిర్యాల (34 కేసులు), సంగారెడ్డి (24 కేసులు) జిల్లాలు వస్తాయి .రంగారెడ్డి జిల్లాలో 43, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 43 కేసులు, ఖమ్మంలో 9 కేసులు గుర్తించారు. ప్రభుత్వ, ప్రయివేటు కొవిడ్ ఆస్పత్రుల్లో చేరికలు కూడా పెరిగాయి. మొత్తం 72 మంది ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 434 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 4,784. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో నేటివరకు 8,01,922 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 93వేల 027 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం రాత్రి కరోనా బులెటిన్ విడుదల చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది.