ఏడో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు చెందిన వేల కోట్ల రూపాయల విలువైన రాజమహళ్ల పంపకాల వివాదంలో ఆయన వారసులకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఆస్తుల పంపకాలపై దాఖలైన దావాను కొట్టివేయాలని కోరుతూ ఎనిమిదో నిజాంగా గుర్తింపు పొందిన ముఖరం జా కుమారుడు అజ్మత్ జా, కుమార్తె షెకర్ జా దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు గురువారం తోసిపుచ్చింది. దీంతో అసలు కేసులో పూర్తిస్థాయి విచారణకు మార్గం సుగమమైంది.
ఏడో నిజాం మనవళ్లలో ఒకరైన నవాబ్ నజఫ్ అలీ ఖాన్, తన తాత ఆస్తులను వారసులందరికీ పంచాలని కోరుతూ 2021లో ఈ దావా వేశారు. ఫలక్‌నుమా ప్యాలెస్, చౌమహల్లా ప్యాలెస్, పురానీ హవేలీ, కింగ్ కోఠి ప్యాలెస్‌తో పాటు ఊటీలోని హేర్‌వుడ్ అండ్ సెడార్స్ బంగ్లా వంటి ఐదు చారిత్రక ఆస్తుల పంపకం జరగాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఆస్తుల ప్రస్తుత విలువ రూ.10,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
ఈ కేసును విచారణకు స్వీకరించవద్దని అజ్మత్ జా, షెకర్ జా కోర్టును ఆశ్రయించారు. అయితే నజఫ్ అలీ ఖాన్ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ, ఏడో నిజాం చట్టబద్ధమైన వారసుడిగా పిటిషనర్‌కు పూర్వీకుల ఆస్తులపై హక్కు ఉందని తెలిపారు. ఆస్తుల యాజమాన్యం, వాస్తవాధీనం, విలువ వంటి అంశాలను పూర్తిస్థాయి విచారణ ద్వారానే తేల్చగలమని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసి, అసలు దావా విచారణకు అనుమతించింది.
1967 ఫిబ్రవరి 24న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరణించిన తర్వాత, భారత ప్రభుత్వం ఆయన మనవడు ముఖరం జాను వారసుడిగా గుర్తించింది. అయితే, నిజాం ప్రైవేట్ ఆస్తులను ఇస్లామిక్ షరియత్ చట్టం ప్రకారం ఆయన 34 మంది సంతానానికి సమానంగా పంచాలని, కేవలం ఒకే వ్యక్తి ఆస్తులను అనుభవించడం సరికాదని నజఫ్ అలీ ఖాన్ వాదిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 232 మంది ప్రతివాదులుగా ఉండగా, వారిలో ఫలక్‌నుమా ప్యాలెస్‌ను నిర్వహిస్తున్న ఇండియన్ హోటల్స్ కంపెనీ కూడా ఉంది