తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలోని పాశమైలారం వద్ద ఉన్న సిగాచీ ఫ్యాక్టరీ(Sigachi Factory)లో గత నెల 30న ఉదయం సంభవించిన పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 143 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 61 మంది కార్మికులు అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడగా, మరో 40 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు కంపెనీ ప్రకటించింది. అయితే, ఇప్పటికీ ఎనిమిది మంది మృతదేహాల ఆచూకీ లభ్యం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పేలుడులో 30 మందికి పైగా కార్మికులు గాయపడినట్లు కంపెనీ వెల్లడించింది.
TTD : తిరుమల శ్రీవాణి దాతల దర్శనానికి కొత్త షెడ్యూల్ అమల్లోకి
ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు కంపెనీ కోటి రూపాయల పరిహారం ప్రకటించింది. అలాగే బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారికి, గాయపడిన వారికి సరైన న్యాయం జరగలేదని, పరిహారం విషయంలో కూడా స్పష్టత లేదని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల పరిహారం విషయంలోనూ ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం.
ఈ పేలుడు ఘటనపై కేసు విచారణను వేగవంతం చేసి, బాధ్యులైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని పిటిషనర్ కోరారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధితులకు తగిన న్యాయం చేకూర్చాల్సిన అవసరం ఉంది.