Akbaruddin Case: అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై తుదితీర్పు నేడే!

ఏంఐఏం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ పదేళ్ల క్రితం నిర్మల్ పట్టణంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తుది తీర్పుని నాంపల్లి కోర్టు మరొకొన్ని గంటల్లో వెల్లడించనుంది.

Published By: HashtagU Telugu Desk
Akbar Imresizer

Akbar Imresizer

ఏంఐఏం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ పదేళ్ల క్రితం నిర్మల్ పట్టణంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తుది తీర్పుని నాంపల్లి కోర్టు మరొకొన్ని గంటల్లో వెల్లడించనుంది. డిసెంబర్‌ 22, 2012 నాడు నిర్మల్‌ లో జరిగిన ఒక బహిరంగసభలో, ఆదిలాబాద్‌లో జరిగిన మరో సభలో హిందువులపైన, హిందూ దేవతలపైన అక్బర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడిన తీరుపై హిందుత్వ సంఘాల నుండి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.

నిర్మల్‌లోని మున్సిపల్‌ గ్రౌండ్స్‌లో మజ్లిస్ ఏర్పాటు చేసిన బహిరంగసభ సభలో పాల్గొన్న అక్బరుద్దీన్‌ మీరు 100 కోట్ల మంది, మేం 25 కోట్ల మందిమి ఒక 15 నిమిషాలు పోలీసులను పక్కనపెడితే ఎవరి సత్తా ఏంటో చూపిస్తామంటూ మాట్లాడారు. ఆ సమయంలోనే ఆదిలాబాద్‌ లో జరిగిన ఒక సభలో హిందూ దేవతలపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలని సుమోటో గా స్వీకరించిన పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 120-B, 153-A, 295, 298, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాదాపు పదేళ్ళపాటు ఈ కేసుపై విచారణ జరిగింది.

అయితే ఆ సందర్భంలోనే పోలీసులు అక్బరుద్దీన్ ను అరెస్టు చేద్దామనుకున్నా, ఆయన లండన్‌ వెళ్లడంతో అక్బరుద్దీన్ ను అరెస్ట్ చేయడం కొద్దిగా ఆలస్యమయింది. అక్బరుద్దీన్ లండన్ నుండి తిరిగిరాగానే పోలీసులు ఆయన్ని కుట్ర, విద్వేషాలు రెచ్చగొట్టడం, మతపరమైన విశ్వాసాన్ని కించపరచడం లాంటి సెక్షన్ల నేపథ్యంలో అరెస్టు చేశారు. ఈ కేసుల్లో ఆయన 40 రోజులు జైల్లో ఉన్నారు. తర్వాత బెయిల్‌పై విడుదలైనా కొన్నిసార్లు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నేరం రుజువైతే అక్బరుద్దీన్‌కు 2 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ రెండు కేసుల్లో విచారణ పూర్తైన నేపథ్యంలో కోర్టు తీర్పు ఉత్కంఠ రేపుతోంది. తీర్పు నేపథ్యంలో నిర్మల్‌, భైంసాలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ పాతబస్తీలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు.

  Last Updated: 13 Apr 2022, 11:17 AM IST