Conflict Between Couples: బాత్రూమ్ శుభ్రతపై దంపతుల మధ్య గొడవ.. ఉరేసుకుని సూసైడ్ చేసుకున్న భార్య

  • Written By:
  • Updated On - March 24, 2022 / 02:56 PM IST

దాంపత్యం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం. అందులోనూ పిల్లలు పుట్టిన తరువాత భార్యాభర్తల మధ్య బంధం మరింత దృఢంగా మారుతుంది. కానీ నేటి కాలంలో చిన్న చిన్న మనస్పర్థలకు, కాస్త మాట తేడా వచ్చినందుకు ఏకంగా ప్రాణాలే తీసుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్ లోనూ అలాంటి ఘటన జరిగింది. దీంతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది.

కూకట్ పల్లిలోని న్యూబాలాజీ నగర్ లో నివాసముంటారు దాసి నవీన్, శృతి దంపతులు. నవీన్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తాడు. శృతి గృహిణి. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్దబాబు వయసు ఆరేళ్లయితే.. చిన్నకుమారుడి వయసు ఏడాదిన్నర ఉంటుంది. కాపురం విషయంలో పెద్దగా ఇబ్బందులు ఏమీ లేకపోయినా.. బాత్రూమ్ క్లీనింగ్ విషయంలో వీరిమధ్య చోటుచేసుకున్న వాగ్వాదం.. చివరకు శృతి ప్రాణాలు తీసుకునేవరకు వెళ్లింది.

నవీన్ బాత్ రూమ్ కు వెళ్లాడు. కానీ ఆ తరువాత దానిని శుభ్రం చేయలేదు. దీంతో అక్కడ నీళ్లు ఎందుకు పోయలేదు అని నవీన్ ను శృతి గట్టిగా అడిగింది. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. అది కాస్తా వివాదంగా మారింది. దీంతో ఈ సంఘటనను అవమానంగా భావించిన శృతి ఇంటిపైనున్న గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయింది. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

నగరాల్లో గజిబిజి జీవితాల వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం తగ్గుతోందని.. అందుకే వారి మధ్య అన్యోన్యత విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంటున్నారు మానసిక నిపుణులు. అందుకే ఇలాంటిదురదృష్టకరమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తినా విపరీత నిర్ణయాలు తీసుకోవద్దని.. అవసరమైతే కౌన్సిలింగ్ కు వెళ్లడం మంచిదని సూచిస్తు్న్నారు.