Site icon HashtagU Telugu

Yashwant Sinha:దేశానికి కేసీఆర్ అవసరమన్న యశ్వంత్ సిన్హా.. మరి రాహుల్, రేవంత్ పరిస్థితి ఏమిటి?

Yashwant Sinha Cm Kcr

Yashwant Sinha Cm Kcr

పొలిటికల్ చదరంగంలో ఏ ఎత్తు వేస్తే ఏ పావు కదులుతుందో.. గేమ్ ఎటు వైపు వెళుతుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి.. ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు ప్రచారానికి వచ్చారు. జల విహార్ లో జరిగిన సభలో మాట్లాడారు. అక్కడివరకు ఓకే. కానీ దేశానికి కేసీఆర్ లాంటి వ్యక్తి అవసరమన్నారు. మరి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటి? తెలంగాణలో ఇప్పుడిదే చర్చ నడుస్తోంది.

విపక్షాలు అన్నీ కలిసి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను నిలబెట్టాయి. ఆయన పేరును చెప్పింది తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీయే. కానీ ఇప్పుడామె.. సిన్హా విషయంలో వెనక్కు తగ్గారు. ఎన్డీఏ ఏకంగా ఆదివాసీ మహిళ అయిన ద్రౌపది ముర్మును పోటీగా నిలబెట్టడంతో ఆ కూటమిలో లేని పార్టీలు కూడా ఆమెకే మద్దతిస్తున్నాయి. దీంతో ముర్ము గెలవడానికి అవకాశాలున్నాయని మమత భావించారో ఏమో కాని.. పోటీ విషయంలో వెనకడుగు వేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆమెపై ఫైరయ్యింది. ముందు సిన్హా అభ్యర్థిత్వం విషయంలో ఏమీ మాట్లాడని కేసీఆర్.. ఇప్పుడు ఏకంగా సిన్హాకు భారీ స్వాగతం పలికారు. తన వాహనంలోని ఫ్రంట్ సీటులో సిన్హాను కూర్చోబెట్టుకుని.. వెనుక సీటులో ఆయన కూర్చున్నారు. అంటే దీనిని బట్టి ఆయనకు ఎంత ప్రాధాన్యతను ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు.

సిన్హా కాస్త కేసీఆర్ ను ప్రశంసల్లో ముంచెత్తడంతో కాంగ్రెస్ కు ఏమీ పాలుపోని పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే విపక్షాలన్నీ కలిసి ఆయనకు మద్దతిచ్చాయి. కానీ ఆయన మాత్రం కేసీఆర్ లాంటి వ్యక్తి దేశానికి అవసరమని చెప్పడం వల్ల.. అటు జాతీయస్థాయిలో రాహుల్ కు, ఇటు రాష్ట్ర స్థాయిలో రేవంత్ రెడ్డికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు రాజకీయంగా అస్సలు పడదు. అందుకే ఇప్పుడు సిన్హా వైఖరి వల్ల ఇరకాటంలో పడిన కాంగ్రెస్.. ఆయనకు మద్దతిచ్చే విషయంలో ఏం చేస్తుందో చూడాలి.