Site icon HashtagU Telugu

Cotton Purchases : రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన పత్తి కొనుగోళ్లు..అసలు ప్రభుత్వం ఉందా లేదా..? – హరీష్

Cci On Cotton Procurement

Cci On Cotton Procurement

రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన పత్తి కొనుగోళ్ల (Cotton purchases) పై మాజీ మంత్రి , సిద్దిపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కనీస మద్దతు ధరకు కూడా అమ్ముకోలేని దుస్థితికి తెలంగాణ రైతాంగాన్ని చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని విమర్శించారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టపోయిన పత్తి రైతులకు, కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ తీరు శాపంగా మారిందన్నారు.

రాష్ట్ర జిన్నింగ్, మిల్లులు పత్తి కొనుగోలు నిలిపివేయడంపై హరీశ్ రావు (Cotton Purchase) సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పత్తి కొనుగోలు చేయబోమని రాష్ట్ర జిన్నింగ్, మిల్లుల యాజమాన్యాలు ప్రకటిస్తే సమస్యకు పరిష్కారం చూపే కనీస ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటన్నారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టపోయిన పత్తి రైతులకు, కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం శాపంగా మారడం శోచనీయం అన్నారు.

పత్తి రైతులు రోడ్లెక్కి లబోదిబోమంటుంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా.. లేనట్లా అని ప్రశ్నించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అలసత్వం, సమన్వయ లోపంతో పత్తి రైతులు చిత్తవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మండిపడ్డారు. పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఫొటోలకు పోజులిచ్చిన మంత్రులు ఇప్పుడు మౌనంగా ఎందుకున్నారని నిలదీశారు. పంట చేతికి వచ్చిన ఈ సమయంలో రైతుల జీవితాలతో చెలగాటమాడటం ఏమిటి? మిల్లుల వద్దకు చేరిన పత్తి లారీల లోడ్లతో రైతులు ఎన్ని రోజులు ఎదురుచూడాలని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడానికి సమయం ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులకు రైతుల సమస్యలు పట్టించుకునే సమయం లేదా? తేమ శాతం సడలింపు, కొత్త నిబంధనల విషయమై ఢిల్లీకి వెళ్లి సీసీఐ అధికారులకు విజ్ఞప్తి చేసే తీరిక లేదా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మొద్దునిద్ర వీడి తేమ శాతం సహా ఇతర నిబంధనల విషయంలో కేంద్రంపై, ఒత్తిడి తేవాలన్నారు.

Read Also : Ram Gopal Varma : చంద్రబాబు, లోకేశ్‌, బ్రాహ్మణి‌లపై కామెంట్స్.. రామ్‌గోపాల్‌ వర్మపై కేసు